విశ్వక్సేన్.. ఏడాదిలో ఎంత డౌన్‌ఫాల్
తన కెరీర్లో ఫెయిల్యూర్లు ఉన్నాయి కానీ.. ఇంతగా విశ్వక్ సినిమా మీద ఎప్పుడూ విమర్శలు వచ్చింది లేదు.
By: Tupaki Desk | 16 Feb 2025 12:30 AM GMTఏ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి అడుగు పెట్టి.. కేవలం తన ప్రతిభతో తక్కువ టైంలో స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు విశ్వక్సేన్. అతను చేసిన సినిమాలకు తోడు ఇప్పటి యువతకు ప్రతిబింబంలా కనిపించే అగ్రెసివ్ యాటిట్యూడ్ అతడి ఫాలోయింగ్ పెరగడానికి కారణమైంది. తన సినిమాలను విశ్వక్ ప్రమోట్ చేసే తీరు ఇండస్ట్రీలో మిగతా యంగ్ హీరోలకు ఒక పాఠం అనే చెప్పాలి. ఐతే ప్రమోషన్లు సినిమా ఓపెనింగ్‌కు ఉపయోగపడతాయి కానీ.. అంతిమంగా ఫలితాన్ని నిర్దేశించేది కంటెంటే.
కానీ ఈ విషయంలోనే విశ్వక్ తడబడుతున్నాడు. చకచకా సినిమాలైతే చేసేస్తున్నాడు కానీ.. వాటిలో కంటెంట్ గురించి పెద్దగా పట్టించుకుంటున్న సంకేతాలు కనిపించడం లేదు. విశ్వక్ లేటెస్ట్ రిలీజ్ 'లైలా' తన కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది. తన జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేసిందీ చిత్రం. తన కెరీర్లో ఫెయిల్యూర్లు ఉన్నాయి కానీ.. ఇంతగా విశ్వక్ సినిమా మీద ఎప్పుడూ విమర్శలు వచ్చింది లేదు.
విశ్వక్ నెమ్మదిగా ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్నాడనడానికి.. తన సినిమాలకు వస్తున్న ఓపెనింగ్సే రుజువు. ఏడాది వ్యవధిలో తన సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. గత ఏడాది మార్చిలో రిలీజైన విశ్వక్ మూవీ 'గామి' పట్ల ప్రేక్షకుల్లో అమితాసక్తి వ్యక్తమైంది. దానికి వరల్డ్ వైడ్ తొలి రోజు రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం. ఐతే విశ్వక్ కెరీర్లో అదొక స్పెషల్ మూవీ. దాని కంటెంట్, విజువల్స్ అన్నీ కూడా వేరే లెవెల్లో కనిపించాయి. దాంతో పోలిస్తే తర్వాతి చిత్రం 'దాస్ కా దమ్కీ' డే-1 కలెక్షన్లు తగ్గాయి. ఐతే రూ.4.5 కోట్లతో అది కూడా బాగానే పెర్ఫామ్ చేసింది. విశ్వక్ మార్కెట్ స్థాయికి అది కూడా మంచి కలెక్షనే. కానీ ఏడాది చివర్లో వచ్చిన 'మెకానిక్ రాకీ'కి వసూళ్లు బాగా పడిపోయాయి. తొలి రోజు కోటిన్నర కలెక్షనే రాబట్టింది 'మెకానిక్ రాకీ'. దానికి యావరేజ్ టాక్ వచ్చింది. ఇక వర్తమానంలోకి వస్తే 'లైలా' కేవలం 1.25 కోట్ల డే-1 వసూళ్లకు పరిమితం అయింది. ఏడాది కిందట విశ్వక్ చిత్రం ఒకటి రూ.8 కోట్లు కొల్లగొడితే.. ఇప్పుడు అందులో ఐదో వంతు వసూళ్లే వచ్చాయి. దీన్ని బట్టే అతడి డౌన్ ఫాల్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.