Begin typing your search above and press return to search.

అనుదీప్ తో విశ్వక్ 'ఫంకీ' - ఇదేదో కొత్తగా ఉందే..

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

By:  Tupaki Desk   |   11 Dec 2024 6:02 AM GMT
అనుదీప్ తో విశ్వక్ ఫంకీ - ఇదేదో కొత్తగా ఉందే..
X

ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో డిఫరెంట్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు. అలాగే ప్రతీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. మిక్స్ డ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవుతుండడం విశేషం. మార్కెట్ లో మాస్ కా దాస్ విశ్వక్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్నట్లు ఇటీవల వచ్చిన సినిమాలతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక విశ్వక్ ఇప్పుడు మరో బిన్నమైన సినిమాతో రాబోతున్నాడు.

కామెడీ డైరెక్టర్ అనుదీప్ కె.వి దర్శకత్వంలో నటించబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఫైనల్ గా ఈ కాంబినేషన్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. వీరి కాంబినేషన్ సినిమాకు 'ఫంకీ' అనే టైటిల్ పెట్టడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది.

హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టగా, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫంకీ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. టైటిల్ తోనే సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు అనిపిస్తోంది. ఫంకీ ప్రాజెక్ట్‌పై నిర్మాతలు ప్రత్యేక నమ్మకం వ్యక్తం చేశారు.

మంచి కామెడీ, ఎమోషన్స్ తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. అనుదీప్ డైరెక్ట్ చేసిన ‘జాతిరత్నాలు’ ద్వారా వచ్చిన వినోదం ఇంకా ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ఉంది. అలాంటి దర్శకుడి సారథ్యంలో విశ్వక్ సేన్ మల్టీ-టాలెంటెడ్ నటన ఈ చిత్రానికి ప్రధాన బలం అవుతుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు హై లెవెల్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఎడిటింగ్ బాధ్యతలను నవీన్ నూలి నిర్వహిస్తుండగా, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. 2025 సంక్రాంతి తరువాత ‘ఫంకీ’ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని నిర్మాతలు తెలిపారు. విశ్వక్ సేన్ – అనుదీప్ కలయికకు ప్రేక్షకుల్లో ఏర్పడిన అంచనాలు మామూలుగా లేవు. ఫంకీ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.