Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: విశ్వక్ పక్కా మాస్ మసాలా ‘మెకానిక్ రాకీ’

రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు

By:  Tupaki Desk   |   20 Oct 2024 12:37 PM GMT
ట్రైలర్ టాక్: విశ్వక్ పక్కా మాస్ మసాలా ‘మెకానిక్ రాకీ’
X

మాస్ కా దాస్‌ విశ్వక్ సేన్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. టీజ‌ర్‌, సాంగ్స్ జనాలను ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ 1.0 ను మేకర్స్ రిలీజ్ చేసారు.

''నువ్వు ఏం ఫికర్ చెయ్యకు నాన్నా.. ఎట్లయినా నేను సివిల్ ఇంజ‌నీర్‌ అయిపోతా'' అంటూ విశ్వ‌క్ సేన్ అంటుండగా.. ''ఏంటి, కంప్యూట‌ర్ సైన్స్ చదివి సివిల్ ఇంజినీర్ అవుతా?'' అంటూ సీనియర్ న‌రేశ్ ఆశ్చర్యంగా ప్రశ్నించడంతో ఈ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. అక్కడి నుంచి ఆద్యంతం ఫన్నీ సీన్స్ తో ఆకట్టుకునేలా సాగింది. మెకానిక్ షెడ్ నిర్వహిస్తున్న నరేశ్.. తన కొడుకు దేనికీ పనికి రాడని చెబుతూ, చివరకు డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలు విశ్వక్‍ కు అప్పజెపుతాడు.

విశ్వక్ దగ్గరకు డ్రైవింగ్ నేర్చుకోడానికి హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్‍, మీనాక్షి చౌదరి వచ్చారు. శ్రద్ధాకి డ్రైవింగ్ నేర్పించడానికి చిరాకు పడుతున్న మన మెకానిక్ రాకీ.. మీనాక్షికి పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ నేర్పిస్తానంటూ లవ్ ట్రాక్ ఎక్కించడానికి ట్రై చేస్తున్నాడు. ఏదొక వంకతో ఆమెను తాకడం.. గిఫ్టులు ఇవ్వడం వంటివి చేస్తూ ఇంప్రెస్ చెయ్యాలని చూస్తున్నాడు. ఆఖరికి అంబేద్కర్ జయంతికి కూడా ఆమెకు గిఫ్ట్ తెచ్చానని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. అయితే ట్రైలర్ శ్రద్ధా శ్రీనాథ్‍ ను విశ్వక్ కిస్ చేయడానికి ట్రై చేస్తుండటం చూస్తే, వీరి మధ్య కూడా లవ్ ట్రాక్ ఉందేమో అనే సందేహం కలుగుతుంది.

విలన్ గా సునీల్ ఎంట్రీతో ట్రైలర్ యాక్షన్ మోడ్ లోకి మారుతుంది. మెకానిక్ షెడ్‍ విషయంలో హీరో తండ్రి నరేష్, సునీల్ మధ్య ఏదో సమస్య వచ్చినట్లుగా తెలుస్తోంది. షెడ్ కోసమే హీరో - విలన్ మధ్య వైరం మొదలైనట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి రంగంలోకి దిగిన విశ్వక్ సేన్ తనదైన శైలిలో మాస్ డైలాగ్స్ చెబుతూ, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. 'రిపేరుకు వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా.. సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా. అంతకు మించి మొండికి వేస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజిన్ తీసి బిగిస్తా' 'నువ్వు రంకి రెడ్డి అయితే నేను రంకు రెడ్డి' అంటూ సునీల్‍ కు విశ్వక్ మాస్ వార్నింగ్ ఇస్తాడు. గుత్తి.. కూష్మాండం.. ఎర్రిపు.. వంటి పదాలు ఈ డైలాగ్స్ లో వినిపిస్తాయి.

ఓవరాల్ గా పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ‘మెకానిక్ రాకీ’ రెడీ అవుతోందని ట్రైలర్1.0 తోనే క్లారిటీ వచ్చేసింది. విశ్వక్ సేన్ ఎప్పటిలాగే తన మార్క్ డైలాగ్ డెలివరీతో.. కామెడీతో పాటు యాక్ష‌న్ సీన్స్ లోనూ అద‌ర‌గొట్టాడు. శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయిగా కనిపించగా.. మీనాక్షి చౌదరి సాధారణ యువతిగా కనిపించింది. హర్ష వర్ధన్, వైవా హర్ష ఇతర పాత్రల్లో కనిపించారు. సునీల్ మరోసారి తన విలనీతో మెరిశారు. ట్రైలర్ లో 'క్లాస్ మెచ్చిన మాస్ మెకానిక్' అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

‘మెకానిక్ రాకీ’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి సమర్పణలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. అన్వర్ అలీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాని దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చెయ్యాలని అనుకున్నారు. కానీ చివరకు 2024 నవంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.