వివాదాలపై స్పందించిన విశ్వక్ సేన్
లైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు.
By: Tupaki Desk | 13 Feb 2025 12:30 PM GMTవిభిన్న కథలతో ప్రేక్షకుల్ని అలరించడానికి ముందుండే హీరోల్లో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసే విశ్వక్ తాజాగా లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
లైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నాడు. లైలా సినిమా అందరికీ ప్రయోగంలా అనిపిస్తుందని, కానీ ఈ సినిమా ఆడియన్స్ కు నచ్చి వర్కవుట్ అయితే ఇంతకంటే కమర్షియల్ సినిమా మరొకటి ఉండదని, సినిమా కథ వింటున్నంత సేపు నవ్వుతూనే ఉన్నానని, ఆడియన్స్ కు ఎందుకు ఈ తరహా ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదనిపించే ఈ సినిమాకు ఓకే చెప్పినట్టు విశ్వక్ తెలిపాడు.
లైలా సినిమాలో రెండు పాత్రల్లో కనిపించానని, అందరి ఫోకస్ లైలా మీదనే ఉందని, కానీ సోనూ మోడల్ పాత్ర కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని, యూత్ మొత్తానికి ఆ పాత్ర చాలా బాగా కనెక్ట్ అవుతుందని విశ్వక్ తెలిపాడు. అయితే కథల ఎంపికలో విషయంలో తాను ఇంతకుముందు కంటే మరింత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నానని విశ్వక్ చెప్పాడు.
వ్యక్తిగతంగా తాను గతంలో కంటే ఇప్పుడు చాలా మారానని, ఆడియన్స్ ఇష్టాలను గమనిస్తూ తాను కూడా అప్డేట్ అయినట్టు చెప్పిన విశ్వక్, ఫ్యూచర్ లో హార్రర్ సినిమాలు తప్ప అన్ని రకాల సినిమాలు చేస్తానని తెలిపాడు. ఇప్పటివరకు తనను ఏ సినిమా భయపెట్టలేదని, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియకుండా ఆ జానర్ లో సినిమాలు చేయలేనని విశ్వక్ అన్నాడు.
ఇక తన సినిమాల రిలీజ్ ముందు వస్తున్న వివాదాలపై కూడా విశ్వక్ ఈ సందర్భంగా మాట్లాడాడు. ఎవరూ వివాదాలను కోరుకోరని, తాను మూడు నెలలకో సినిమా చేస్తుంటానని, ఒక సినిమా విషయంలో జరిగినా సరే ప్రతీసారీ ఏదో జరిగినట్టే అనిపిస్తుందని, అయినా రోడ్డుపై ఎక్కువ తిరిగే వాళ్లకే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగినట్టు, తన విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు అనిపిస్తుందని విశ్వక్ అభిప్రాయపడ్డాడు. సినిమా ఫంక్షన్స్ లో సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలనే రూల్ పెడితే బావుంటుందని, కానీ అది ఇండస్ట్రీ పెద్దలంతా కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయమని విశ్వక్ తెలిపాడు.
లైలా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, యూత్ ఈ సినిమాను నెక్ట్స్ లెవల్ లో ఎంజాయ్ చేస్తారని చెప్తున్నాడు విశ్వక్. లైలా పాత్ర తన కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్ గా నిలుస్తుందని చెప్తున్న విశ్వక్ ఈ సినిమా విజయం పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.