'లైలా' సినిమా శాస్త్రవేత్తల కోసం కాదు..!
విశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన 'లైలా' సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 8 Feb 2025 7:30 PM GMTవిశ్వక్ సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన 'లైలా' సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా విశ్వక్ సేన్ లేడీ గెటప్‌తో సినిమా స్థాయి మరో లెవల్‌కి వెళ్లినట్లు అయ్యింది. సాధారణంగా యంగ్ హీరోల లేడీ గెటప్ వేసుకునేందుకు వెనకాడుతారు. కానీ పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ లేడీ గెటప్ వేసుకోవడంతో ఆ తర్వాత పలువురు యంగ్ హీరోలు లేడీ గెటప్‌లో కనిపించేందుకు సిగ్గు పడటం లేదు. విశ్వక్ సేన్ సైతం సినిమా కోసం లేడీగా కనిపించబోతున్నాడు. లైలా సినిమాకు ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో యూనిట్ సక్సెస్ అయ్యింది.
ఈ సినిమా గురించి విశ్వక్ సేన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ సినిమాను తాము రూపొందించింది ఫిల్మ్ నగర్ శాస్త్రవేత్తల కోసం కాదని, వినోదాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం అంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాటలతో విశ్వక్ సేన్ రివ్యూవర్స్‌కి పంచ్ ఇచ్చాడు. కొందరు సినిమా విడుదల తర్వాత లోతుగా విశ్లేషించి, రకరకాలుగా కామెంట్స్ చేసి, శాస్త్రవేత్తల మాదిరిగా లోపాలను కనిపెట్టే వారి కోసం కాకుండా ఈ సినిమాను వినోదాన్ని మాత్రమే కోరుకునే ప్రేక్షకుల కోసం అంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. తమ సినిమా ఒక మంచి వినోదాత్మక సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను విశ్వక్ సేన్ వ్యక్తం చేశాడు.
తాను చేసే ప్రతి సినిమాను ఒకే జోనర్‌లో ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు విభిన్నమైన సినిమాలతో తాను వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు ఎలా ఉంటాయో అందరికి తెల్సిందే. తన గత చిత్రం మెకానిక్ రాకీ, ఈ సినిమాకు సైతం చాలా వైవిధ్యం ఉంటుంది. ప్రతి సినిమాను కొత్తగా చూపించాలని, కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతోనే చేస్తానంటూ విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. సినిమా పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచే ఇది ఒక మంచి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నాడు.
ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ కారణంగానే సినిమాకు ఎ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. సినిమాలో అశ్లీలత ఉండదని విశ్వక్ సేన్ చెబుతున్నాడు. శృతి మించి ఏమీ చూపించలేదని ఆయన పేర్కొన్నాడు. అన్ని వర్గాల వారు చక్కగా కూర్చుని సినిమాను చూసి ఎంజాయ్ చేసే విధంగా 'లైలా' ఉంటుందని ఆయన హామీ ఇచ్చాడు. సోనూ ఎందుకు లైలాగా మారాడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది సినిమా కథ. లేడీ గెటప్‌లో హీరోలు నటించిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి.