విశ్వక్ గామికి అరుదైన రికార్డు
కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 1 Feb 2025 11:23 AM GMTటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన గామి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది. ఈ సినిమాతో విద్యాధర్ కాగిత టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. చాందినీ చౌదరి హీరోయిన్ గా కనిపించి మెప్పించింది. కార్తీక్ శబరీష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా గామి సినిమా ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్‌డామ్2025 కు ఈ సినిమా అఫీషియల్ గా సెలెక్ట్ అయింది. ఫిబ్రవరి 9 వరకు నెదర్లాండ్స్ లో జరగనున్న ఈ ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్ లో గామిని ప్రదర్శించనున్నారు. ఈ విషయం తెలిసిన చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.
ముందు క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ గా మొదలైన ఈ సినిమాకు తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేక్ వచ్చింది. మొత్తానికి సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆరేళ్లకు పూర్తైంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించి మంచి నటనను కనబరిచాడు. సినిమాకు మంచి టాక్ అయితే వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఆ రేంజ్ లో రాలేదు.
శంకర్(విశ్వక్) అఘోరాగా నటించిన ఈ సినిమాలో తనెవరు, తన గతమేంటనే విషయాలేమీ అతనికి గుర్తుండవు. దానికి తోడు మనిషి స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో శంకర్ బాధ పడుతుండగా, అతడిని శాపగ్రస్థుడిలా భావించి అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి బయటకు పంపుతారు.
దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని అన్వేషణను మొదలుపెట్టి ద్రోణగిరి పర్వతాల్లో 36 ఏళ్లకొకసారి వికసించే మాలిపత్రాలు దొరికితే తన సమస్య తొలగిపోతుందని నమ్మి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు శంకర్. అక్కడకు వెళ్లే క్రమంలో అతనిక ఎదురయ్యే సమస్యల ఆధారంగా గామి రూపొందించబడింది. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ప్రస్తుతం తన కొత్త సినిమా లైలాతో ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.