వారి మోసానికి రెండు రోజులు ఏడ్చాను : విశ్వక్ సేన్
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన లైలా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.
By: Tupaki Desk | 13 Feb 2025 3:56 PM GMTటాలీవుడ్‌లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాలపై ఆసక్తితో కాలేజ్ రోజుల నుంచే షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన విశ్వక్ సేన్ అసలు పేరు దినేష్ నాయుడు. ఆ పేరు కలిసి రావడం లేదని కొందరి సూచనతో 'ఫలక్ నామా దాస్' సినిమా కోసం విశ్వక్ సేన్ గా పేరు మార్చుకున్నాడు. రేపు ఈయన నటించిన 'లైలా' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటి సారి విశ్వక్ సేన్ లేడీ గెటప్‌తో నటించాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన లైలా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.
'లైలా' ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ... స్కూల్‌లో ఉన్న సమయంలోనే సినిమాలపై ఆసక్తితో ఎడిటింగ్ నేర్చుకున్నాను. కాలేజ్ డేస్‌లో సినిమాల్లో నటించేందుకు ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. మాస్ కమ్యూనికేషన్స్ చదువుతూ నటించడం మొదలు పెట్టాను. మొదట షార్ట్ ఫిల్మ్స్ లో నటించాను. హీరోగా మొదటి సినిమా 'వెళ్లి పోమాకే' ను చేశాను. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా విడుదల కావడంలో ఆలస్యం అయింది. ఆ సినిమా విడుదల అవుతుందనే నమ్మకం లేకపోవడంతో మళ్లీ ఆఫర్ల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరిగాను. ఒక సినిమా ఆఫీస్ చుట్టూ దాదాపు మూడు నెలల పాటు తిరిగాను.
మూడు నెలల పాటు ప్రతి రోజు ఆ సినిమా ఆఫీస్‌కి వెళ్లడం, ఆడిషన్స్ ఇవ్వడం, కథ గురించి ఇతర విషయాల గురించి చర్చించడం చేసేవాళ్లం. మొదట నన్ను మెయిన్ హీరో అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు సెకండ్ హీరో అన్నారు. అయినా పర్వాలేదు అనుకుని ప్రతి రోజు ఆఫీస్‌కి వెళ్తూ ఉండేవాడిని. ఒక రోజు అనుకోని పరిస్థితుల కారణంగా ఆఫీస్‌కి వెళ్లలేక పోయాను. దాంతో దర్శకుడి ఈగో హర్ట్ అయ్యి నా పాత్ర స్థాయిని మరింతగా తగ్గించాడు. హీరో తర్వాత నాలుగో స్థానానికి పరిమితం చేశాడు. అయినా చేసేందుకు ఓకే చెప్పాను. సినిమా కొన్ని రోజుల షూటింగ్ తర్వాత నన్ను తొలగించామని చెప్పారు. దాంతో రెండు రోజుల పాటు ఏడ్చుకుంటూ ఇంట్లోనే కూర్చున్నాను.
అప్పుడే 'అంగమలై డైరీస్' సినిమా రీమేక్ చేద్దామనే ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని నాన్నకి చెబితే ఆ చెత్త సినిమాను రీమేక్ చేస్తానంటావా అని తిట్టారు. అయినా పట్టుబట్టి రూ.11 లక్షలకు ఆ సినిమా డబ్బింగ్ రైట్స్‌ను కొనుగోలు చేశాను. సినిమా షూటింగ్ సైతం చాలా సైలెంట్‌గా చేశాం. అప్పుడే నా పేరును మార్చుకున్నాను. పేరు మార్చుకున్న కొన్ని రోజుల్లోనే మొదటి సినిమా వెళ్లి పోమాకే విడుదల అయ్యింది. ఆ వెంటనే ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం దక్కింది. అంతే కాకుండా ఫలక్ నామా దాస్ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం చేయడం ద్వారా మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో రాణించాలంటే ఓపికతో ఉండాలని విశ్వక్ సేన్ ఉదంతం సాక్ష్యంగా నిలుస్తుంది.