Begin typing your search above and press return to search.

లేడీ క్యారక్టర్ అని లైలాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు..!

అయితే విశ్వక్ కంటే ముందు ఈ కథను ముగ్గురు నలుగురు హీరోల దగ్గరకు తీసుకొని వెళ్లినట్లుగా షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు.

By:  Tupaki Desk   |   23 Jan 2025 6:04 PM GMT
లేడీ క్యారక్టర్ అని లైలాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోలు..!
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ''లైలా''గా లేడీ గెటప్ లో కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే. రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ఈ చిత్రం, వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇందులో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. అయితే విశ్వక్ కంటే ముందు ఈ కథను ముగ్గురు నలుగురు హీరోల దగ్గరకు తీసుకొని వెళ్లినట్లుగా షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. లేడీ క్యారక్టర్ చేయగలుగుతామో లేదో అనే భయంతో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసారని, కానీ విశ్వక్ మాత్రం ఖచ్చితంగా ఈ పాత్ర చేస్తానని ముందుకు వచ్చాడని తెలిపారు.

'లైలా' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ‘ఇచ్చుకుందాం బేబీ’ అనే పాటను విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత సాహు మాట్లాడుతూ.. ''డైరెక్టర్ రామ్ ఈ స్టోరీ చెప్పిన తర్వాత ముగ్గురు నలుగురు హీరోలకు అప్రోచ్ అయ్యాను. కానీ లేడీ క్యారెక్టర్ చేయగలుగుతామా లేదా? అనుకుంటున్న టైంలో, బ్రదర్ విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తాను ఎదురుచూస్తున్నాని, డెఫినిట్ గా చేయగలుగుతానని ముందుకు వచ్చాడు. తను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు అనేది మేం చూసాం. కచ్చితంగా ఈ క్యారక్టర్ అందరూ చేయలేరు. ఇదొక మంచి క్యారెక్టర్ గా విశ్వక్ ఫిల్మోగ్రఫీలో నిలిచిపోతుంది. ట్యాలెంటెడ్ యూత్ ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు. దీంతో 'లైలా'ని రిజెక్ట్ చేసిన ఆ హీరోలు ఎవరై ఉంటారబ్బా అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.

ఇకపోతే లేడీ గెటప్‌లో తన తండ్రి కూడా గుర్తు పట్టలేకపోయాడని విశ్వక్‌ సేన్‌ చేసారు. ''యాక్టర్ గా నా విష్ లో ఉన్న సినిమా 'లైలా'. ఇలాంటి స్టోరీ, క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. రామ్ నాకు కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశా. నా కెరీర్‌లో ఇంత ఫన్‌ రైడ్‌ మూవీ చేయలేదు. ‘లైలా’ గెటప్‌ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్‌ చేశా.. చాలా సేపు ఇద్దరం సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయాం. నన్ను గుర్తుపడతారేమోనని చూశా. ఆయన ఏమీ మాట్లాడకపోయే సరికి ‘డాడీ.. నేను’ అన్నాను. ఆయన నన్ను చూసి కంగారు పడిపోయారు. నా ఫోన్‌ నుంచి ఎవరో అమ్మాయి కాల్‌ చేసి, నాకు ఇస్తుందేమోనని నాన్న అనుకున్నారట. నా కన్న తండ్రే నన్ను గుర్తుపట్టలేదు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈసారి మీకు లైలా వుంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ ఉన్నాడు. లైలా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. లైలా కోసం రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి'' అని విశ్వక్‌ అన్నారు.

డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ.. ''లైలా లాంటి సబ్జెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్. ఈ సబ్జెక్ట్ ని ఒప్పుకున్నందుకు సాహుకి చాలా థాంక్స్. ఈ కథ కొందరు హీరోలు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉన్న వాడే చెయ్యాలి. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ నాకు దొరికాడు. తనకు లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. నా టీమ్ అందరి టెక్నికల్ బ్రిలియన్స్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది'' అని అన్నారు. 'దాస్ కా ధమ్కీ'లో తాను రాసిన 'ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా' సాంగ్ 100 మిలియన్స్ కొట్టిందని, ఇప్పుడు 'ఇచ్చుకుందాం బేబీ' పాటకి 200 మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నానని లిరిసిస్ట్ పూర్ణచారి అన్నారు.