లైలా గెటప్‌లో విశ్వక్.. తండ్రే గుర్తుపట్టలేని పరిస్థితి!
ఈ సినిమాలో విశ్వక్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. ఈ విషయంపై మాట్లాడుతూ, “లైలా గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేశా.
By: Tupaki Desk | 23 Jan 2025 4:28 PM GMTయంగ్ హీరో విశ్వక్‌సేన్ తన నటనకు విభిన్న కోణాలను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘లైలా’ (Laila)లో విశ్వక్ ప్రధాన పాత్రలో అలరించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించగా, ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
ఈమధ్య కాలంలో ఏ హీరో చేయనటువంటి ప్రయోగాత్మకమైన కథతో రాబోతున్నాడు. సినిమాలో అమ్మాయిగా విశ్వక్ నెవ్వర్ బిఫోర్ అనేలా సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోస్టర్స్ కూడా పాజిటివ్ ఇంప్రెషన్స్ క్రియేట్ చేశాయి. గురువారం విడుదలైన ‘ఇచ్చుకుందాం బేబీ.. ముద్దు ఇచ్చుకుందాం బేబీ..’ పాటతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.
ఈ సందర్భంగా హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమని వివరించాడు. “సాహు గారపాటి గారు దర్శకుడు రామ్‌కు నా గురించి చెప్పినప్పుడు ‘విశ్వక్ ఈ కథ వినడు’ అన్నారట. కానీ, కథ చెప్పగానే నేను వెంటనే ఓకే చెప్పేశా. ఇలాంటి ఫన్ రైడ్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. నా కెరీర్‌లో ఇంత ఫన్‌తో నిండిన సినిమా ఇప్పటివరకు చేయలేదు,” అని విశ్వక్ చెప్పాడు.
ఈ సినిమాలో విశ్వక్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నాడు. ఈ విషయంపై మాట్లాడుతూ, “లైలా గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేశా. ఆయన నన్ను గుర్తుపడతారని అనుకున్నా. కానీ, చాలా సేపు ఇద్దరం నిశ్శబ్దంగా ఒకరికొకరు చూస్తూ ఉన్నాం. చివరికి ‘డాడీ, నేను’ అని చెప్పాను. అప్పటి వరకు ఆయన మరెవరో అమ్మాయి నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తుందేమోనని అనుకున్నారు. నన్ను కన్న తండ్రే గుర్తుపట్టలేకపోయిన ఈ గెటప్ మీ అందరికీ ఎంత నచ్చుతుందో ఊహించొచ్చు,” అని విశ్వక్ ఆసక్తికరంగా చెప్పాడు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, “రామ్ నారాయణ్ కథ చెప్పిన తర్వాత చాలా మంది హీరోలను సంప్రదించాను. లేడీ క్యారెక్టర్‌ను సరిగ్గా చేస్తారా? లేదా? అని అనుకుంటున్న సమయంలో విశ్వక్ ఈ కథ నచ్చి, చేస్తానని ముందుకు వచ్చారు. అలాంటి పాత్రలో విశ్వక్ చేయడం నిజంగా సాహసమే. ఈ సినిమా విశేషంగా అలరిస్తుంది,” అని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
యోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ప్రమోషన్లతో సినిమాపై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ‘లైలా’లో విశ్వక్ తన నటనలో కొత్తదనాన్ని చూపించడమే కాకుండా, తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి ఈ ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.