Begin typing your search above and press return to search.

మా సినిమాను చంపకండి: విశ్వక్ సేన్

లైలా మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   10 Feb 2025 10:55 AM GMT
మా సినిమాను చంపకండి: విశ్వక్ సేన్
X

లైలా మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. దీనివల్ల సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాల్సింది పోయి, #BoycottLaila అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. సినిమా యూనిట్ ఈ వివాదంపై స్పందిస్తూ, తమకు ఈ వ్యాఖ్యలతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.


నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది ఒక ప్రకటన విడుదల చేశారు. “ఈవెంట్‌లో నటుడు పృధ్వీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు. అవి మా సంస్థ లేదా మా చిత్రబృందం అభిప్రాయాలను ప్రతిబింబించవు. మా సినిమా కేవలం వినోదానికి మాత్రమే. మేము ఏ విధమైన రాజకీయ అంశాలను ప్రోత్సహించము. అందరూ సినిమాను సినిమా కోణంలోనే చూడాలని మనవి.” అని వారు తెలిపారు.

ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, పృథ్వి మాట్లాడుతున్న సమయంలో తాము అక్కడ లేమని చిరంజీవిని స్వాగతం చెప్పేందుకు బయటికి వెళ్లగా, ఆ సమయంలోనే పృధ్వీ ఈ వ్యాఖ్యలు చేశారని నిర్మాతలు వివరించారు. “మా కంట్రోల్‌లోనే అన్నీ జరుగుతాయి అని చెప్పలేం. ఈవెంట్‌లో ఎవరు ఏం మాట్లాడతారో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఇలాంటి అనవసరమైన వివాదాల వల్ల మా సినిమాను దెబ్బతీయొద్దని మనవి.” అని యూనిట్ అభిప్రాయపడింది.

ఈ విషయంపై హీరో విశ్వక్ సేన్ కూడా స్పందిస్తూ, “మా ఈవెంట్‌లో జరిగిన దానికి మేము బాధ్యత వహించలేం. సినిమా మాకు ప్రాణం. ఎవరో ఒకరు పొరపాటు చేస్తే అందరూ బాధితులుగా మారాలా? సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. దయచేసి సినిమా కోసం మేము వేసిన శ్రమను అర్ధం చేసుకోండి. సినిమాను చంపకండి” అంటూ విజ్ఞప్తి చేశాడు. విశ్వక్ చేసిన వ్యాఖ్యలపై అతని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఈ వివాదంపై యూనిట్ సభ్యులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇవ్వడం మెచ్చుకోదగిన విషయం. సినిమా ప్రపంచానికి సంబంధించినదే, అయితే రాజకీయాలకు దూరంగా ఉంచాలని చిత్రబృందం కోరుతోంది. కానీ బాయ్‌కాట్ లైలా ట్రెండ్ ఎలా మారుతుందనేది వేచిచూడాలి. మొత్తానికి, అనుకోకుండా వచ్చిన ఈ వివాదం లైలా చిత్రానికి ప్రమోషన్ కల్పించిందా? లేక ప్రతికూలతను తెచ్చిపెట్టిందా? అనేది సినిమా విడుదలైన తర్వాతే స్పష్టమవుతుంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది, విడుదలకు ముందు ఇలాంటి వివాదాలు ముగిసేలా చూడాలని యూనిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.