Begin typing your search above and press return to search.

క్ష‌మించండి.. ఇక‌పై నా సినిమాల్లో అస‌భ్య‌త ఉండ‌దు: విశ్వ‌క్ సేన్

లైలా సినిమా అంద‌రినీ నిరాశ‌కు గురి చేసిన నేప‌థ్యంలో హీరో విశ్వ‌క్ సేన్ అభిమానుల‌కు ఓ బ‌హిరంగ లేఖ రాశాడు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 4:19 PM IST
క్ష‌మించండి.. ఇక‌పై నా సినిమాల్లో అస‌భ్య‌త ఉండ‌దు: విశ్వ‌క్ సేన్
X

త‌న న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వంతో మ‌ల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విశ్వ‌క్ సేన్. సినిమా సినిమాకీ భిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ, కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తూ కెరీర్ లో ముందుకెళ్తున్న మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ రీసెంట్ గా లైలా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయింది.


షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాలో విశ్వ‌క్ లేడీ గెట‌ప్ లో క‌నిపించాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో లైలా సినిమాపై న‌మ్మ‌కంతో విశ్వ‌క్ ఎంతో కాన్ఫిడెంట్ గా సినిమా అంద‌రినీ అల‌రిస్తుంద‌ని చెప్పాడు. ట్రైల‌ర్ చూసి మూవీలో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉందేమో క‌దా అని ప్ర‌మోష‌న్స్ లో అడిగితే అలాంటిదేమీ లేద‌ని, థియేట‌ర్ల‌లో ప్ర‌తి ఒక్క‌రూ లైలా మూవీ చూసి ఎంజాయ్ చేస్తార‌ని చెప్పాడు.

కానీ తీరా సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాక లైలా సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ ఆ సినిమా గురించి తిట్టే వాళ్లే. విశ్వ‌క్ కెరీర్లోనే లైలా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ మూవీ అని, అస‌లు ఇలాంటి అస‌భ్య‌క‌ర సినిమాను ఎలా తీశావ‌ని సోష‌ల్ మీడియాలో అంద‌రూ విశ్వ‌క్ పై మండిప‌డ్డారు కూడా. లైలా సినిమా అంద‌రినీ నిరాశ‌కు గురి చేసిన నేప‌థ్యంలో హీరో విశ్వ‌క్ సేన్ అభిమానుల‌కు ఓ బ‌హిరంగ లేఖ రాశాడు.

ఇటీవల "నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ.. నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండ‌దు" అని విశ్వ‌క్ రాసుకొచ్చాడు.

దాంతో పాటూ ''నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని విశ్వ‌క్ త‌న మ‌న‌సులోని భావాలను లెట‌ర్ ద్వారా పంచుకున్నాడు. విశ్వ‌క్ రాసిన ఆ లెట‌ర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.