కిరణ్ అబ్బవరానికి మాస్ కా దాస్ సపోర్ట్
తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్పందించారు. కిరణ్ కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
By: Tupaki Desk | 30 Oct 2024 9:41 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాజావారు రాణిగారు మూవీతో తొలిసారి హీరోగా పలకరించిన ఆయన.. డెబ్యూ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సమ్మతమే వంటి పలు సినిమాలతో అలరించారు. వరుసగా ఎనిమిది సినిమాలు చేసి ఆశ్చర్చపరిచారు. వాటిలో కొన్ని సినిమాలు అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోకపోవడంతో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొన్నారు.
ఇప్పుడు 'క' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న కిరణ్ అబ్బవరం.. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రోలింగ్ పై స్పందించారు. తన సినిమాలపై పనికట్టుకొని కొన్ని సంస్థలు ట్రోల్ చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు ప్రాబ్లమ్ ఏంటి? తాను ఎదగకూడదా అని ప్రశ్నించారు. కూలీ పని చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు హీరో అయ్యానని తెలిపారు. నిద్రలేక చాలా సినిమాల్లో అందంగా కనిపించలేదని చెప్పారు. తానేం ఫెయిల్యూర్ యాక్టర్ ని కాదని అన్నారు.
దీంతో కిరణ్ అబ్బవరం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పలువురు టాలీవుడ్ యంగ్ హీరోస్ నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్పందించారు. కిరణ్ కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎదిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కిరణ్ కు మరింత పవర్ చేకూరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. 'క' మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ వైరలవుతోంది.
సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరానికి అనేక మంది నెటిజన్లు కూడా సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు. కచ్చితంగా క మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. మూవీ టీమ్ కు కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అంటూ సందడి చేస్తున్నారు. దీపావళికి పోటీ ఉన్నా.. కంటెంట్ పై నమ్మకంతో కిరణ్ బరిలోకి దిగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణగిరి బ్యాక్ డ్రాప్ తో రూపొందిన 'క' మూవీని కొత్త దర్శకులు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించారు. నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్ 31న తెలుగులో విడుదల కానుంది. అయితే తెలుగుతోపాటు వివిధ భాషల్లో కూడా అదే రోజు రిలీజ్ విడుదల చేయాలని భావించినప్పటికీ.. వేరే రాష్ట్రాల్లో థియేటర్లు దొరకడం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్ తెలిపారు. అందుకే తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.