'లైలా' మూవీ రివ్యూ
కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ రూపొందించిన ఈ చిత్రం వేలంటైన్స్ డే కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
By: Tupaki Desk | 14 Feb 2025 8:19 AM GMT‘లైలా’ మూవీ రివ్యూ
నటీనటులు: విశ్వక్సేన్-ఆకాంక్ష శర్మ-అభిమన్యు సింగ్-పృథ్వీ-మిర్చి కిరణ్ తదితరులు
సంగీతం: లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
రచన: వాసుదేవ మూర్తి
నిర్మాత: సాహు గారపాటి
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రామ్ నారాయణ్
గ్యాప్ లేకుండా సినిమాలు అందించే యంగ్ హీరో విశ్వక్సేన్ నుంచి వచ్చిన కొత్త చిత్రం.. లైలా. అతను హీరోగానే కాక కథలో కీలకమైన లైలా అనే లేడీ క్యారెక్టర్ కూడా చేసిన సినిమా ఇది. కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ రూపొందించిన ఈ చిత్రం వేలంటైన్స్ డే కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
సోను (విశ్వక్సేన్) హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తన తల్లి వారసత్వంగా వచ్చిన బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. అతడికి అక్కడ మాంచి లేడీ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఈ ఫాలోయింగ్ కొంతమందికి నచ్చదు. దీనికి తోడు ఇబ్బందులు పడ్డ వాళ్లందరూ తన పతనం కోసం ఎదురు చూస్తుంటారు. ఇలాంటి సమయంలోనే రుస్తుం (అభిమన్యు సింగ్) అనే రౌడీ.. సోను చేసిన ఓ పనితో అతడి మీద పగ పెంచుకుంటాడు. ఈ క్రమంలోనూ సోను శత్రువులంతా కలిసి అతణ్ని పెద్ద స్కాంలో ఇరికిస్తారు. దీంతో సోను ఎవరి కంటా పడకుండా దాక్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ స్థితిలో అతనేం చేశాడు.. తన ఐడెంటిటీని దాచిపెట్టి తన సమస్యలన్నీ ఎలా పరిష్కరించుకున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘లైలా’లో ఒక సీన్లో వయసు మీద పడ్డా పెళ్లి కావట్లేదని ఫీలయ్యే విలన్.. తన చేతిని చూసుకుని బాధ పడుతుంటాడు. ఏమైందని తండ్రి అడిగితే.. ‘‘నా జాతకం ఎలా ఉందని జ్యోతిష్యుడికి చూపిస్తే నీ చేతిలో రేఖలన్నీ అరిగిపోయాయి అన్నాడు’’ అంటూ ఏడుస్తాడు. ఇంకో సీన్లో మేకల దొడ్డిలో కూర్చున్న కమెడియన్ పృథ్వీ ఈ మేకలకు కొత్త ఆకులేమైనా వెయ్యండ్రా అంటూ ఏదో డైలాగ్ చెబుతాడు. దానికి అవతలున్న వ్యక్తి.. ‘‘ఆకులెందుకు కొత్తగా మొలిచిన నా...’’ అంటూ డైలాగ్ కంప్లీట్ చేసేస్తాడు. సెన్సార్ బోర్డు పుణ్యమా అని అక్కడో బీప్ సౌండ్ వచ్చినా డైలాగ్ ఏంటన్నది ప్రేక్షకులకు సులువుగానే అర్థమైపోతుంది. మరో సన్నివేశంలో ఓ పాత్రధారి.. ‘‘ఆ సోనుగాడు ఓల్డ్ సిటీలో ఉన్న లేడీస్ అందరినీ ఏస్తున్నాయ్’’ అంటాడు. ఏం ఏస్తున్నాయిరా అని అడిగితే.. ‘‘మేకప్ ఏస్తున్నాయ్’’ అంటాడు. ‘లైలా’ ఎంత లో లెవల్ సినిమానో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. డైలాగులే మాత్రమే ఇలా ఉన్నాయేమో అనుకోవడానికి లేదు. కొన్ని దృశ్యాల గురించి ఇక్కడ వర్ణించే సాహసం కూడా చేయలేం. ‘‘విశ్వక్సేన్ సినిమా అంటే ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది’’ అనే పేరును చెడగొట్టుకోవడానికి పనిగట్టుకుని అతను ‘లైలా’ చేశాడేమో అనిపిస్తుంది. దీన్ని బీట్ చేసే అథమ స్తాయి సినిమాను అతను మళ్లీ చేయగలడా అన్నది కూడా సందేహమే.
‘లైలా’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ట్రైలర్లోని డైలాగులు.. సీన్ల గురించి తక్కువ చేసి మాట్లాడుతుంటే.. సినిమా చూడకుండానే ఓ నిర్ణయానికి రావొద్దని అన్నాడు విశ్వక్సేన్. నిజానికి ‘లైలా’ టీం అక్కడ చూపించింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా తెర మీద కనిపిస్తుంది. ట్రైలర్ ను మించిన బూతు సన్నివేశాలు.. డైలాగులు సినిమాలో కోకొల్లలు. బోల్డ్ సీన్లకు.. బూతు డైలాగులకు ఈ తరం ప్రేక్షకులు ఎంత అలవాటు పడిపోయినా సరే.. ఇందులోని కంటెంట్ తట్టుకోలేని స్థాయిలోనే అనిపిస్తుంది. సన్నివేశాలు-సంభాషణలు బోల్డ్ గా ఉండడం వేరు.. వల్గర్ గా అనిపించడం వేరు. ‘లైలా’ రెండో కోవకే చెందుతుంది. భామనే సత్యభామనే.. మేడమ్.. లాంటి చిత్రాల్లో హీరోలు ఆడవేషం వేసి తమకు ఎదురైన సమస్యను పరిష్కరించుకోవడం చూశాం. అందులో హీరోలు ఆడవేషం వేయడానికి బలమైన కారణం కనిపిస్తుంది. దాని చుట్టూ ఒక ఎమోషన్ రన్ అవుతుంది. వినోదం పండించడానికి ఆయా పాత్రలు బాగా ఉపయోగపడ్డాయి. కానీ ‘లైలా’లో హీరోతో ఆడవేషం వేయించడానికి అంత బలమైన కారణమే కనిపించదు. ఇదంతా ఒక బలవంతపు వ్యవహారంలా అనిపిస్తుంది. ఒక విలనేమో తన అక్రమ సంబంధాన్ని బయటపెట్టాడని హీరో మీద పగబడతాడు. ఇంకొకడేమో మేకప్ వేసి మేనేజ్ చేసి ఒక అమ్మాయిని తనకు అంటగట్టాడని కోపం పెంచుకుంటాడు. ఇంకొకడేమో హీరో మేకప్ టెక్నిక్ వల్ల లేడీస్ అందరూ అతడికి ఫ్యాన్స్ అయిపోయారని కక్షగడతాడు. ఇలాంటి కారణాలతో హీరోకు వ్యతిరేకంగా విలన్లు కూటమి కడుతుంటే.. ప్రేక్షకులు సినిమాను ఏమాత్రం సీరియస్ గా తీసుకోగలరు?
ఇదంతా ఒకెత్తయితే.. కథానాయికతో హీరో రొమాంటిక్ ట్రాక్ మరో ఎత్తు. హీరోను చూడగానే మంటెత్తిపోయే హీరోయిన్.. తనను మీదికి ఎత్తుకుని పార్కులో పరుగులు తీయగానే ఒంట్లో సెగలు పుట్టేసి తనకు పడిపోతుంది. పదే పదే హీరోయిన్ అవయవాల మీద కెమెరా ఫోకస్ చేసిన తీరుతోనే ఈ సినిమా స్థాయి ఏంటో ఒక అంచనాకు వచ్చేయొచ్చు. ప్రథమార్ధంలో సోను పాత్ర చుట్టూ తిరిగే కథ పరమ రొటీన్ అనిపిస్తూ.. విసుగు పుట్టిస్తే.. ‘లైలా’ పాత్ర రంగప్రవేశంతో అయినా పరిస్థితి మారుతుందని ఆశిస్తాం. కానీ ఈ పాత్ర వచ్చాక సోను క్యారెక్టర్.. దాని చుట్టూ నడిపించిన సీన్లే కొంచెం నయం అనిపిస్తుంది. లాజిక్ ను పూర్తిగా కొండెక్కించేస్తూ.. బూతుల డోస్ ఇంకా పెంచుతూ ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలు సినిమాను ఇంకా ఇంకా కింది స్థాయి తీసుకెళ్లిపోతాయి. ఇందులో ‘పండు’ చుట్టూ నడిపిన కొన్ని కామెడీ సీన్లయితే మరీ వల్గర్ అనిపిస్తాయి. ఏమాత్రం బలంగా అనిపించని.. ఎమోషన్ లేని.. రొటీన్ సీన్లతో ‘లైలా’ చికాకు పెడుతుంది. కామెడీ సైతం పెద్దగా వర్కవుట్ కాలేదు. చివరి వరకు కూర్చుని మమ అనిపించాలే తప్ప పతాక సన్నివేశాల్లో కూడా ‘లైలా’ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించదు. విశ్వక్ కే కాదు.. అభిమానులకూ ఇది పూర్తిగా మరిచిపోదగ్గ చిత్రమే.
నటీనటులు:
విశ్వక్సేన్ ‘లైలా’ అవతారం కోసం కష్టపడ్డాడు. ఆ పాత్రలో తన బాడీ లాంగ్వేజ్.. హావభావాలు అవీ బాగానే ఉన్నాయి. సోను పాత్రలో విశ్వక్ లుక్ బాగుంది. ఆ క్యారెక్టర్లో పెర్ఫామెన్స్ అయితే కొత్తగా ఏమీ అనిపించదు. ఓవరాల్ గా విశ్వక్ అయితే తన తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ ఆకాంక్ష శర్మను ఒక గ్లామర్ డాల్ గా చూపించడానికి ప్రయత్నించారు. ప్రతి సన్నివేశంలోనూ కెమెరా ఆమె అందాల మీదే ఫోకస్ చేసింది. కొన్నిసార్లు కెమెరా యాంగిల్స్ టూమచ్ అనిపిస్తాయి. నటన పరంగా ఆకాంక్ష గురించి చెప్పడానికి ఏమీ లేదు. ‘గబ్బర్ సింగ్’ విలన్ అభిమన్యు సింగ్ స్థాయి ఎంత పడిపోయిందో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అతను చేసిన రుస్తుం పాత్ర.. తన నటన విసుగు తెప్పిస్తాయి. పృథ్వీ.. పృథ్వీరాజ్.. మిగతా నటీనటులు కూడా చాలా మొక్కుబడిగా నటించినట్లు అనిపిస్తుంది.
సాంకేతిక వర్గం:
‘లైలా’లో సాంకేతిక హంగులు పర్వాలేదనిపిస్తాయి. లియోన్ జేమ్స్ పాటల్లో విశేషంగా చెప్పుకోదగ్గవేమీ లేవు. ఏదో అలా అలా నడిచిపోయాయి. నేపథ్య సంగీతం బాగానే సాగింది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. నిర్మాతలేమీ రాజీ పడలేదు. వాసుదేవ మూర్తి రైటింగ్.. రామ్ నారాయణ్ డైరెక్షన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ రోజుల్లో ఇలాంటి కథతో.. ఇలాంటి టేకింగ్ తో మెప్పించగలమని ఎలా అనుకున్నారో? కొన్ని సన్నివేశాలు.. డైలాగుల గురించి ఇక్కడ రాయడం కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మాస్.. కామెడీ పేరుతో మరీ అథమ స్థాయి సీన్లు రాసి.. తీసి వదిలేశారు.
చివరగా: లైలా... గోల గోల
రేటింగ్- 1.75/5