విశ్వంభర ఫస్ట్ సింగిల్ వచ్చేదప్పుడే!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్టతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది.
By: Tupaki Desk | 23 Feb 2025 8:30 AM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్టతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విశ్వంభర టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. దీంతో విశ్వంభరపై అందరికీ భారీ అంచనాలున్నాయి. విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో విశ్వంభర ఎప్పుడు రిలీజవుతుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. వాస్తవానికి విశ్వంభర ఈ సంక్రాంతికే రిలీజవాల్సింది కానీ షూటింగ్ లో జాప్యం, వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం అవడం వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. సినిమాను వాయిదా అయితే వేశారు కానీ మళ్లీ కొత్త రిలీజ్ డేట్ ను మాత్రం మేకర్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.
ఇదిలా ఉంటే విశ్వంభర ఆడియో గురించి ఫిల్మ్ నగర్ లో సాలిడ్ టాక్ వినిపిస్తోంది. కీరవాణి ఈ సినిమాకు నెక్ట్స్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడని, ఈ మ్యూజిక్ కు మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయమని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట ట్వీట్ చేయగా, ఆయన మాటలతో విశ్వంభరపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే విశ్వంభరకు సంబంధించిన ఓ మాస్ సాంగ్ ను డైరెక్టర్ వశిష్ట తెరకెక్కించాడట. రాముల వారిపై రామ రామ అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా వచ్చిందని, ఈ పాటలోనే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపిస్తాడని, పాట వినగానే ఆడియన్స్ కు నచ్చేలా ఈ పాటను కీరవాణి కంపోజ్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
ఈ సాంగ్‌నే మేకర్స్ విశ్వంభర నుంచి మొదటిగా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఉగాదికి ఈ సాంగ్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది. కేవలం ఈ పాట మాత్రమే కాదు, విశ్వంభరలో మిగిలిన పాటలు కూడా చాలా బాగా వచ్చాయంటున్నారు.