విశ్వంభర.. వ్వాటే డేట్!
రిలీజ్ డేట్ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించి అనౌన్స్ చేసినట్లు అర్ధమవుతోంది.
By: Tupaki Desk | 4 Feb 2024 9:47 AM GMTమెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమా విశ్వంభరను పట్టాలు ఎక్కించేసిన విషయం తెలిసిందే. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్.. చిరంజీవి లేకుండానే ఇటీవల మొదలైంది. మారేడుమిల్లి అడవుల్లో మొదటి షెడ్యూల్ షూట్ ను పూర్తి చేశారు. ఇక తాజాగా చిరు.. సెట్స్ లో అడుగుపెట్టారు. అయితే మెగాస్టార్ ఎంట్రీ అంటే కొంచెం స్పెషల్ ఉండాలి కదా.
అందుకనే ఎంట్రీ ఇస్తూనే మూవీ రిలీజ్ డేట్ ను ఏడాది ముందే అనౌన్స్ చేసేశారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. గతంలో చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంజి కూడా సంక్రాంతి కానుక గానే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు విశ్వంభర కూడా సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది.
ఇదంతా పక్కన పెడితే.. విశ్వంభర మేకర్స్ బాక్సాఫీస్ వద్ద పెద్ద టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించి అనౌన్స్ చేసినట్లు అర్ధమవుతోంది. జనవరి 10 శుక్రవారం కాగా, ఆ తర్వాత వీకెండ్స్ శని, ఆదివారాలు, ఆ తర్వాత వరుసగా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలు వస్తున్నాయి. మామూలుగా సంక్రాంతి టైంలో వసూళ్లు ఓ రేంజ్ లో వస్తాయి.
అలాంటిది కంప్లీట్ ఫస్ట్ వీక్ మాస్టర్ ప్లాన్ తో విశ్వంభర మూవీ బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు చెబుతున్నారు. అందరికన్నా ముందు కర్ఛీప్ వేయడమే కాకుండా, ఎంతో చాకచక్యంగా ఆలోచించి రిలీజ్ డేట్ ప్రకటించారని అంటున్నారు. ఏదేమైనా వచ్చే సంక్రాంతికి మెగాస్టారే ఫస్ట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా మిగతా చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చూడాలి.
పంచభూతాల నేపథ్యంతో మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ తో విశ్వంభర సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇటీవల ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. రిలీజ్ చేసిన కాన్సెప్ట్ గ్లింప్స్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో థ్రిల్ చేసింది. టైటిల్ గ్లింప్స్ తోనే మూవీ పై భారీ హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో మొత్తం విశ్వాన్ని చూపించేందుకు.. దాదాపు 13 సెట్స్ ను నిర్మించారట.
యాక్షన్ సీన్స్ కూడా ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇటీవల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ తో కలిసి.. యాక్షన్ పార్ట్ డిజైన్ క్లాస్ లు కూడా నిర్వహించారట. ఇక అంజి సినిమాలో తన సినిమాటోగ్రఫీతో మెస్మరైజ్ చేసిన చోటా కె నాయుడు.. ఈ చిత్రానికి కూడా కెమెరా మెన్‌గా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా.. ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.