Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో వెండి తెర‌పై బంగారు ద‌ర్శ‌కుడి క‌థ‌

ఈ నేప‌థ్యంలో క‌ళా త‌పస్వి, దాదా సాహేబ్ పాల్కే అవార్డు గ్ర‌హీత కాశీనాథుని విశ్వ‌నాథ్ జీవితం ఆధారంగా విశ్వ ద‌ర్శ‌నం పేరిట ఓ సినిమాను తెర‌కెక్కించారు. జనార్థ‌న మ‌హ‌ర్షి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ విశ్వ ద‌ర్శ‌నంను తెర‌కెక్కించాడు.

By:  Tupaki Desk   |   19 Feb 2025 11:38 AM GMT
త్వ‌ర‌లో వెండి తెర‌పై బంగారు ద‌ర్శ‌కుడి క‌థ‌
X

ప్ర‌స్తుతం అన్ని భాష‌ల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌ళా త‌పస్వి, దాదా సాహేబ్ పాల్కే అవార్డు గ్ర‌హీత కాశీనాథుని విశ్వ‌నాథ్ జీవితం ఆధారంగా విశ్వ ద‌ర్శ‌నం పేరిట ఓ సినిమాను తెర‌కెక్కించారు. జనార్థ‌న మ‌హ‌ర్షి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ విశ్వ ద‌ర్శ‌నంను తెర‌కెక్కించాడు.


ఇవాళ విశ్వ‌నాథ్ జ‌యంతి సంద‌ర్భంగా నిర్మాణ సంస్థ దానికి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ లో రాధికా శ‌ర‌త్ కుమార్, భాను ప్రియ‌, శైల‌జ‌, సుశీల‌, సీతారామ శాస్త్రి, తనికెళ్ల భ‌ర‌ణి లాంటి ప్ర‌ముఖులు కె. విశ్వ‌నాథ్ గురించి చెప్పిన మాట‌ల్ని పొందుప‌రిచిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. ఈ గ్లింప్స్ చూశాక ఇది సినిమానా లేక డాక్యుమెంట‌రీనా అనే సందేహం కూడా క‌లుగుతుంది.

విశ్వ‌నాథ్ మీదున్న అభిమానంతో జ‌నార్ధ‌న మ‌హర్షి ఈ సినిమాను 2019లోనే తెర‌కెక్కించాడు. కాక‌పోతే ఆ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ కాలేదు. అంటే ఈ సినిమా విశ్వ‌నాథ్ ఉన్న‌ప్పుడే తెర‌కెక్కిన సినిమా. కానీ ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ అయింది లేదు. ఇప్పుడు విశ్వ‌నాథ్ మ‌న మ‌ధ్య‌లో లేరు. ఇప్ప‌టికైనా సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చి నేటి త‌రానికి ఆయ‌న గురించి తెలియచేయాల‌నుకుంటున్నాడు జ‌నార్ధ‌న మ‌హ‌ర్షి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ విశ్వ ద‌ర్శ‌నం సినిమాను త్వ‌ర‌లో ఓటీటీలోకి తీసుకురానున్న‌ట్టు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ ను రిలీజ్ చేస్తూ వెల్ల‌డించింది. వెండితెర చెప్పిన బంగారు ద‌ర్శ‌కుడి క‌థ అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సోష‌ల్ మీడియాలో ఈ ప్రోమోను రిలీజ్ చేసింది.