Begin typing your search above and press return to search.

'విశ్వం' మూవీ రివ్యూ

ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వీళ్లిద్దరూ కోరుకున్న విజయాన్ని ఇచ్చేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

By:  Tupaki Desk   |   11 Oct 2024 9:29 AM GMT
విశ్వం మూవీ రివ్యూ
X

‘విశ్వం’ మూవీ రివ్యూ

నటీనటులు: గోపీచంద్-కావ్య థాపర్-జిషు సేన్ గుప్తా-ముకేష్ రుషి-కిక్ శ్యామ్-అనీషా ఆంబ్రోస్-సునీల్-నరేష్-పృథ్వీ-వెన్నెల కిషోర్-వీటీవీ గణేష్-రాహుల్ రామకృష్ణ-ప్రగతి-ప్రవీణ్-బెనర్జీ-భరత్ తదితరులు

సంగీతం: చేతన్ భరద్వాజ్

ఛాయాగ్రహణం: గుహన్

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్-వేణు దొనెపూడి

స్క్రీన్ ప్లే: గోపీ మోహన్-భాను-నందు-ప్రవీణ్ వర్మ

కథ-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల

ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన శ్రీను వైట్ల.. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తర్వాత ఆయన కెరీర్లో బాగా గ్యాప్ వచ్చింది. మరోవైపు హీరో గోపీచంద్ కూడా చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే.. విశ్వం. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం వీళ్లిద్దరూ కోరుకున్న విజయాన్ని ఇచ్చేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ:

ప్రమాదకరమైన టెర్రరిస్ట్ గ్రూప్ ఒక చిన్న పాప వెంట పడుతుంటుంది. ఆ గ్రూప్ చేసిన హత్యను ఆ పాప చూడడమే అందుక్కారణం. ప్రమాదంలో ఉన్న ఆ పాపను గోపీ (గోపీచంద్) ఒకటికి రెండుసార్లు కాపాడతాడు. అతను మిలాన్ లో కారు నడుపుకునే డ్రైవర్. తాను ప్రేమించిన అమ్మాయిని కలవడం కోసం ఇండియా వచ్చిన గోపీ.. పాపకు రక్షణగా తనతోనే ఉంటాడు. కానీ పోలీసుల రక్షణలోకి వెళ్లిన పాప మీద మరోసారి దాడి జరుగుతుంది. టెర్రరిస్ట్ గ్రూప్ ఆ పాపను కాల్చేస్తుంది. తనను మరోసారి కాపాడే ప్రయత్నం చేసిన గోపీ గురించి అప్పుడే అసలు నిజం తెలుస్తుంది. తన పేరు గోపీ కాదని విశ్వం అని వెల్లడవుతుంది. ఇంతకీ ఈ విశ్వం ఎవరు.. తనకు పాపకు సంబంధమేంటి? టెర్రరిస్ట్ గ్రూపుతో అతని కనెక్షన్ ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

టెర్రరిస్టుల చేతుల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయిపోయిన హీరో.. అతణ్ని పెంచి పెద్ద చేసి టెర్రరిస్టుల అంతు చూసే స్పెషల్ పోలీసును చేసే మేజర్.. ఆ మేజర్ కుటుంబాన్ని చంపేసే టెర్రరిస్టులు.. వాళ్లను మట్టుపెట్టే హీరో.. తన పాత చిత్రాల్లో కథలు-కామెడీ మొనాటనస్ అయిపోయాయని.. కానీ ‘విశ్వం’లో స్టోరీ సహా అన్నీ తాజాగా ఉంటాయని చెప్పిన శ్రీను వైట్ల అల్లుకున్న కథ ఇది. ఈ లైన్లో ఎన్ని కథలు రాలేదు..? ఎన్ని సినిమాలు చూడలేదు..? ఐతే లైన్ ఒకేలా ఉన్నా ట్రీట్మెంట్ అయినా డిఫరెంటుగా ఏమైనా ఉందా అంటే అదీ లేదు. ఇండియా నుంచి ఇటలీ దాకా హీరో ఎక్కడికి వెళ్లినా ఎదురే ఉండదు. అత్యంత క్రూరమైన టెర్రరిస్టులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి పారేస్తుంటాడు. విలనేమో విలన్ లాగా కాకుండా ఒక జోకర్ లాగా అనిపిస్తాడు. ప్రపంచాన్ని గడగలలాడించే టెర్రరిస్ట్ లీడర్ ఒక కామెడీ లోకల్ పోలీసుకు రైల్వే స్టేషన్లో ఈజీగా దొరికేసి.. అతను వేసే సిల్లీ జోకులకు ఇరిటేట్ అవుతూ ట్రైన్లోనే ప్రయాణం చేస్తుంటాడు. ఇలాంటి సెటప్ మధ్య కథను కానీ.. క్యారెక్టర్లను కానీ ఎలా సీరియస్ గా తీసుకుంటాం? అడుగడుగునా ఔట్ డేటెడ్ వాసనలు కొట్టే సినిమాతో ఎలా ఎంగేజ్ అవుతాం? శ్రీను వైట్ల చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని.. ఎంతో కసరత్తు చేసి తీసిన సినిమానే కానీ.. ఆయన్నుంచి కొత్తగా ఇంకేమీ ఆశించలేమని ‘విశ్వం’తో మరోసారి రుజువైపోయింది.

వెన్నెల కిషోర్.. పృథ్వీ.. సునీల్.. నరేష్.. ప్రగతి.. రాహుల్ రామకృష్ణ.. శ్రీకాంత్ అయ్యంగార్.. ప్రవీణ్.. షకలక శంకర్.. అజయ్ ఘోష్.. గౌతం రాజు.. గుండు సుదర్శన్.. శ్రీనివాస్ రెడ్డి.. రఘు కారుమంచి.. వీటీవీ గణేష్.. ఏంటీ లిస్ట్ అనుకుంటున్నారా? ‘విశ్వం’లో ప్రేక్షకులన పడి పడి నవ్వించేలా చేయాలని శ్రీను వైట్ల పెట్టుకున్న కమెడియన్ల లిస్టు. ఐతే తెర మీద బోలెడంతమంది కమెడియన్లు కనిపించినంత మాత్రాన నవ్వు వచ్చేయదు. వాళ్లకు సరైన క్యారెక్టర్లు రాయాలి. ఫన్నీ సిచువేషన్లు సెట్ చేయాలి. మంచి డైలాగులు పడాలి. వాళ్ల కామెడీ టైమింగ్ కుదరాలి. కానీ వెన్నెల కిషోర్.. పృథ్వీ మినహాయిస్తే ఇందులో ఎవ్వరూ నవ్వించలేకపోయారు. వాళ్లిద్దరివీ కూడా పేలిపోయే క్యారెక్టర్లేమీ కాదు. కానీ సినిమాలో మిగతా ట్రాక్స్ అన్నీ విసుగెత్తిస్తున్న సమయంలో వీళ్లిద్దరూ కనిపించినపుడు మాత్రం రిలీఫ్ వస్తుంది. తన కర్మ కాలిపోయి ఒక గేటెడ్ కమ్యూనిటీలో బానిసగా మారిన జాలిరెడ్డి పాత్రలో పృథ్వీ.. ప్రమాదంలో చనిపోయిన తన కుటుంబ సభ్యుల్ని వేరే వాళ్లలో ఊహించుకుంటూ వాళ్లతో కనెక్ట్ అయ్యే క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ తమ శక్తి మేర నవ్వించే ప్రయత్నం చేశారు. వీళ్లిద్దరి వల్ల సినిమాలో అక్కడక్కడా కొంచెం టైంపాస్ అవుతుంది తప్ప.. సినిమాలో చెప్పుకోదగ్గ వేరే విశేషాలు ఏమీ లేవు.

విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుందని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ జిషు సేన్ గుప్తా పాత్రను చాలా పేలవంగా తీర్చిదిద్దడంతో ఏ దశలోనూ అతణ్ని సీరియస్ గా తీసుకోలేరు ప్రేక్షకులు. ఆ పాత్ర తేలిపోవడంతో హీరో పాత్ర కూడా ఎక్కడా ఎలివేట్ అవ్వడానికి అవకాశం లేకపోయింది. జిషు లుక్స్.. తను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్లకు అలవాటు పడ్డ ప్రేక్షకులకు అతను ప్రమాదకర టెర్రరిస్ట్ లీడర్ అంటే అసలు నమ్మబుద్ధి కాదు. అతను టెర్రరిస్ట్ అనిపించేలా మినిమం ఎఫర్ట్ కూడా పెట్టినట్లు కనిపించదు. జిషు అనే కాదు.. టెర్రరిస్ట్ గ్రూప్ సెటప్ అంతా కూడా చాలా అసహజంగా.. ముతకగా అనిపించడం ‘విశ్వం’ సినిమా నీరుగారిపోవడానికి ప్రధాన కారణం. హీరో పాత్ర నేపథ్యం.. తన ఫ్లాష్ బ్యాక్ ఏవీ కూడా కొత్తగా అనిపించవు. వందల సినిమాల్లో చూసిన సెటప్పే ఇందులోనూ కనిపిస్తుంది. ఐతే కథ.. హీరో పాత్ర ఎంత రొటీన్ గా ఉన్నప్పటికీ.. వేరే అంశాలైతే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తే వాటిని లైట్ తీసుకోవచ్చు. కానీ సినిమాలో రొమాన్స్.. కామెడీ.. ఇలా ఏ అంశం కూడా ప్రేక్షకులను పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఇటలీలో రిచ్ లొకేషన్ల మధ్య హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ తీశారు. కానీ అది కూడా ఏ దశలోనూ ఆసక్తి రేకెత్తించదు. తాను తీసిన దూకుడు.. బాద్ షా లాంటి సినిమాలను శ్రీను వైట్ల అనుకరిస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప కొత్తగా ఏమీ కనిపించదు. సన్నివేశాలు ఆయా సినిమాల్లో మాదిరి అనిపిస్తాయి తప్ప.. వాటిలో మాాదిరి శ్రీను వైట్ల వినోదం మాత్రం పండించలేకపోయాడు. బేసిగ్గా కథ వీక్.. దీనికి తోడు వినోదం కూడా అనుకున్న స్థాయిలో పండలేదు.. కొత్తదనం రవ్వంతయినా కనిపించదు. ఇక ‘విశ్వం’తో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ కాగలరు. వెన్నెల కిషోర్.. పృథ్వీ పంచే కాస్త వినోదం కోసం రెండున్నర గంటలకు పైగా ‘విశ్వం’ను భరించాలంటే కష్టమే.

నటీనటులు:

గోపీచంద్ ఎప్పట్లాగే చూడ్డానికి బాగున్నాడు. కానీ తన పాత్ర.. నటన రొటీన్ గా అనిపిస్తాయి. శ్రీను వైట్ల స్టయిల్లో డైలాగ్ డెలివరీలో కొంచెం వేగం పెంచాడు తప్ప.. మేకోవర్ అంటూ ఏమీ లేదు. గోపీచంద్ విగ్రహానికి యాక్షన్ ఘట్టాల్లో ఎప్పుడూ బాగానే అనిపిస్తాడు. హీరోయిన్ కావ్య థాపర్ తనకు అలవాటైన రీతిలో గ్లామర్ ఒలకబోసింది. పాటల్లోనే కాక సన్నివేశాల్లోనూ క్లీవేజ్ షోతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తన పాత్ర.. నటన గురించి చెప్పడానికి ఏమీ లేదు. విలన్ పాత్రలో జిషు సేన్ గుప్తా తేలిపోయాడు. తన కెరీర్లో అత్యంత పేలవమైన పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. వెన్నెల కిషోర్ కు టిపికల్ కామెడీ రోల్ పడడంతో తన వంతుగా నవ్వించే ప్రయత్నం చేశాడు. పృథ్వీ కూడా కొంత వినోదాన్ని పంచాడు. మామూలుగా వైట్ల సినిమాల్లో బ్రహ్మానందం కనిపించే పాత్ర తనది. భార్యాభర్తలుగా నరేష్.. ప్రగతి జోడీ బాగానే చేసింది. సునీల్ సహా వేరే కమెడియన్లెవ్వరూ నవ్వించలేకపోయారు. కిక్ శ్యామ్.. ముఖేష్ రుషి.. బెనర్జీ.. ఇలా చాలా తారాగణమే ఉన్నా ఎవ్వరూ చెప్పుకోదగ్గ ఇంపాక్ట్ వెయ్యలేకపోయారు. అందుకు నామమాత్రమైన వారి పాత్రలే కారణం. కాసేపు కనిపించిన అనీషా ఆంబ్రోస్ బాగా పెర్ఫామ్ చేసింది. చిన్న పాప కూడా బాగా చేసింది.

సాంకేతిక వర్గం:

చేతన్ భరద్వాజ్ పాటలు సోసోగా అనిపిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య ఇటలీలో తీసిన ఒక డ్యూయెట్ కొంచెం ప్లెజెంట్ గా అనిపిస్తుంది. నేపథ్య సంగీతంలో ప్రత్యేకత చూపించడానికి అవసరమైన సిచువేషన్లు ఏమీ కనిపించవు. కేవీ గుహన్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాణ విలువల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. భారీ లొకేషన్లలో.. పెద్ద కాస్టింగ్ తో గ్రాండ్ గా తీశారు సినిమాను. కానీ తన ట్రాక్ రికార్డు చూడకుండా నిర్మాతలు అన్ని వనరులూ బాగా సమకూర్చినప్పటికీ శ్రీను వైట్ల ఉపయోగించుకోలేకపోయాడు. కథ.. కామెడీ విషయంలో ఆయన ఎంత వద్దనుకున్నా తన ‘టెంప్లేట్’ ఛాయలు కొట్టొచ్చినట్లే కనిపిస్తున్నాయి. అలా అని ముందులా ఎంటర్టైన్ చేయగలిగాడా అంటే అదీ లేదు. ఔట్ డేటెడ్ కథను ఎంచుకుని దాని చుట్టూ ఎంత మేకప్ చేయాలని చూసినా ఫలితం లేకపోయింది.

చివరగా: విశ్వం.. అదే పాత ‘వైట్ల’ కథ

రేటింగ్- 2/5