ది ఢిల్లీ ఫైల్స్.. వచ్చేది ఎప్పుడంటే..
జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సాహసోపేత కథలను తెరపైకి తీసుకురావడంలో ముందుంటారు.
By: Tupaki Desk | 3 Oct 2024 8:08 AM GMTజాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి సాహసోపేత కథలను తెరపైకి తీసుకురావడంలో ముందుంటారు. ది తాష్కెంట్ ఫైల్స్, ది కశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ వంటి సినిమాలతో ఆయన సృష్టించిన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తాజా ప్రాజెక్టుగా అగ్నిహోత్రి ది ఢిల్లీ ఫైల్స్ అనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాను రూపొందిస్తున్నారు.
పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్, తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ వంటి ఘన విజయం సాధించిన తర్వాత, వీరిద్దరూ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ది ఢిల్లీ ఫైల్స్ సినిమా మొదటి నుండి మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి జరిగిన పరిశోధన అత్యంత సమగ్రంగా జరిగింది.
వివేక్ అగ్నిహోత్రి తన బృందంతో కలిసి దేశవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధన చేపట్టారు. కేరళ నుండి కోల్కతా, ఢిల్లీ వరకు విస్తరించిన ఈ ప్రయాణంలో 100 కంటే ఎక్కువ పుస్తకాలు, 200 పైగా వ్యాసాలు చదివారట. 20 రాష్టాలపై వివిధ ప్రదేశాలకు ప్రయాణించి, 7000 పేజీల పరిశోధన డాక్యుమెంట్లు, 1000 పైగా ఆర్కైవ్ చేసిన వ్యాసాలు అధ్యయనం చేశారు. ఈ భారీ పరిశోధన సినిమా కథకు ప్రధానం ఆయువు పట్టుగా నిలిచినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ది ఢిల్లీ ఫైల్స్ రెండు భాగాలుగా విడుదల కానుందని దర్శకుడు వివేక్ వెల్లడించారు. మొదటి భాగం ది బెంగాల్ చాప్టర్ పేరుతో 2025 ఆగస్టు 15న, ఇండిపెండెన్స్ డే రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ అంశాన్ని వివేక్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ, ఆసక్తికరమైన పోస్టర్‌ని కూడా పంచుకున్నారు.
“ఇండిపెండెన్స్ డేకి మీ క్యాలెండర్‌లను మార్క్ చేసుకోండి: ఆగస్టు 15, 2025. సంవత్సరాలుగా జరిగిన పరిశోధన ఫలితంగా, ది ఢిల్లీ ఫైల్స్ కథ ఒకే భాగంలో చెప్పలేనంత శక్తివంతంగా ఉంది. మొదటి భాగంగా ది బెంగాల్ చాప్టర్ మీ ముందుకు రాబోతోంది” అంటూ ట్వీట్ చేశారు. అగ్నిహోత్రి సినిమాలు ఎప్పుడూ సామాజిక, రాజకీయ అంశాలను సాహసోపేతంగా ప్రతిపాదించేలా ఉంటాయి.
ది ఢిల్లీ ఫైల్స్ లో కూడా మన దేశ చరిత్రలో జరిగిన ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. ఇంతకు ముందు విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించడమే కాకుండా, కశ్మీరీ పండిట్ల విషాదాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇప్పుడు అదే తరహాలో ది ఢిల్లీ ఫైల్స్ కూడా సామాజిక ప్రయోజనం కలిగిన కథతో, ప్రేక్షకులను అలరించనుంది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి నిర్మిస్తున్నారు. అలాగే, తేజ్ నారాయణ అగర్వాల్ మరియు ఐ యామ్ బుద్ధ సంస్థలు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2025 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి.