సెన్సార్ విధానంపై ప్రముఖ దర్శకుడు ఫైర్
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఎమర్జెన్సీ సినిమాను నిర్మించానని గత ఇంటర్వ్యూల్లో చెప్పారు.
By: Tupaki Desk | 5 Sep 2024 6:00 AM GMTబాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఎమర్జెన్సీ సినిమాను నిర్మించానని గత ఇంటర్వ్యూల్లో చెప్పారు. తనకు అప్పులు ఉన్న విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. ఇందిరాగాంధీ పాలనలో ఎమర్జెన్సీ కాలం ఆధారంగా `ఎమర్జెన్సీ` సినిమాని స్వీయ దర్శకత్వం నిర్మాణంలో తెరకెక్కించిన కంగన ఈ శుక్రవారం (సెప్టెంబర్ 6, 2024) విడుదలకు సిద్ధం చేసింది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఇది వాయిదా పడింది. దానికి కారకులపైనా కంగన ఘాటైన వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ అధికారులకు ప్రాణహాని ఉందని, అందుకే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడంలో జాప్యానికి కారణమైందని కంగనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే దీనికి ప్రతిస్పందనగా `ది కాశ్మీర్ ఫైల్స్` డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన X ప్రొఫైల్ లో ఘాటైన వ్యాఖ్యలు చేసారు. ``సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్ చేయకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇంకా సెన్సార్‌షిప్‌పై పట్టుబట్టినట్లయితే, టీవీ చర్చలు, వార్తా కార్యక్రమాలు, రాజకీయ ప్రసంగాలు, మతపరమైన ప్రసంగాలతో ఎందుకు ప్రారంభించకూడదు? ఇవి రెగ్యులర్ గా వినిపించే నకిలీ వార్తలు. విభజన, ద్వేషం, హింసకు నిజమైన మూలాలు. విమర్శలను పట్టించుకోకుండా మౌనంగా ఉంచే బదులు.. వాటిని ఎదుర్కొనే ధైర్యం చేసి సెన్సార్ వాళ్లు తమ అభిప్రాయాలను చెప్పాలని ఉద్ఘాటించారు. పిరికివాళ్ళు తమ వికారమైన ముఖాన్ని బహిర్గతం చేసే వాటిని మాత్రమే సెన్సార్ చేస్తారు.. అని కూడా సీబీఎఫ్‌సిని దుయ్యబట్టారు.
కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో అగ్నిహోత్రి పోస్ట్‌ను షేర్ చేసి ఆయన వైఖరికి ఆనందం వ్యక్తం చేసారు. ఇంతకీ ఎమర్జెన్సీ సెన్సార్‌షిప్ ఎప్పటికి పూర్తవుతుంది? అన్నది సస్పెన్స్ గా మారింది. సెన్సార్ షిప్ పై కంగన, అగ్నిహోత్రి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కంగన ప్రస్తుతం మండి (హిమచల్ ప్రదేశ్) ఎంపీగా ఉండి కూడా తన సినిమాని రిలీజ్ చేసుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వర్గీయులు ఈ సినిమా రిలీజ్ కి మోకాలడ్డుతున్నారని కూడా కంగన ఆరోపిస్తోంది.