Begin typing your search above and press return to search.

నా సినిమా నా ఇష్టం... ఎవరినీ పట్టించుకోను!

బాలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.

By:  Tupaki Desk   |   24 Aug 2024 2:30 PM GMT
నా సినిమా నా ఇష్టం... ఎవరినీ పట్టించుకోను!
X

బాలీవుడ్ విభిన్న చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఈ మధ్య కాలంలో ఈయన తీస్తున్న సినిమాలన్నీ కూడా వివాదాస్పద అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే ఈయన్ను వివాదాల దర్శకుడు అంటూ కొందరు పిలుస్తున్నారు. కొందరు మాత్రం కావాలనే ఈయన వివాదాస్పద సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటున్నాడు అంటూ విమర్శిస్తున్నారు. ఈయన తీసే సినిమాల వల్ల జనాల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాడు అంటూ సినీ వర్గాల వారు కూడా కొందరు ఆయన తీరును తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి.

ఎవరు ఏమన్నా కూడా నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తాను అంటూ వివేక్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ది కశ్మీర్‌ ఫైల్స్ సినిమా కొందరికి బాగున్నా కొందరికి మాత్రం ఆ సినిమా ఇబ్బంది కలిగిస్తుంది. కొందరిలో ఆ సినిమా ద్వేషాన్ని రగిల్చే విధంగా ఉందనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ది ఢిల్లీ ఫైల్స్ సినిమా కూడా ఒక వర్గం వారిని టార్గెట్‌ చేసే విధంగా ఉంటుందని, అది ఏమాత్రం కరెక్ట్‌ కాదని కొందరు సోషల్‌ మీడియా ద్వారా ఇప్పటి నుంచే విమర్శలు మొదలు పెట్టారు.

తాను రూపొందిస్తున్న సినిమాలపై వస్తున్న విమర్శలకు దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి స్పందించాడు. ఏ దర్శకుడికి అయినా నచ్చిన సబ్జెక్ట్‌ ను ఎంపిక చేసుకుని సినిమాను రూపొందించే స్వేచ్చ ఉంది. ఆ స్వేచ్ఛ ను కాదనే హక్కు ఏ ఒక్కరికి లేదు. అలాగే నాకు కూడా నేను కోరుకున్న సబ్జెక్ట్‌ ని తీసుకుని సినిమాగా రూపొందించే స్వేచ్ఛ ఉంది. అందుకే నాకు అభిరుచి ఉన్న కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందిస్తున్నాను. దానికి నన్ను ఏ ఒక్కరు విమర్శించేందుకు హక్కు లేదు. అందరి మాదిరిగానే నేను నా అభిరుచితో ప్రేక్షకుల మెప్పు కోసం సినిమాలు తీస్తున్నాను అన్నాడు.

1966 లో ఉజ్బెకిస్థాన్‌ లో పీఎం లాల్ బహదూర్‌ శాస్త్రీ మరణించిన జరిగిన ఘటనల ఆధారంగా ది తాష్కెంట్ ఫైల్స్‌ అనే సినిమాను రూపొందించాడు. అప్పటి నుంచి కూడా ఈయన ప్రతి సినిమా వివాదాస్పదం అవుతూనే ఉంది. ప్రస్తుతం రూపొందిస్తున్న ఢిల్లీ ఫైల్స్ సినిమా అవిభక్త బెంగాల్‌ లో జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాడు. ఒక వర్గం మెప్పు కోసం, రాజకీయ ఉద్దేశ్యంతోనే వివేక్ అగ్నిహోత్రి ఇలా సినిమాలు తీస్తున్నారు అంటూ ఆయనపై రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా కూడా వేటిని ఆయన పట్టించుకోవడం లేదు. తాను తీయాలి అనుకున్న సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.