ఇది ముగ్గురు 'మేధావులు' ప్లాన్ చేసిన బ్రిలియంట్ బ్యాంక్ రాబరీ
డిజిటల్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలకు కొదువ లేకుండా పోయింది
By: Tupaki Desk | 20 Feb 2024 2:15 PM GMTడిజిటల్ వేదికలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిభావంతులకు అవకాశాలకు కొదువ లేకుండా పోయింది. సినిమా ఆఫర్స్ కోసం ఎదురు చూడకుండా, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. సరికొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఒప్పించగలిగే న్యూ కాన్సెప్టులను ఎంచుకొని, యూట్యూబ్ లాంటి ఫ్లాట్ ఫార్మ్స్ కోసం లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవల్ లో అవార్డులు అందుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తద్వారా సినిమా రంగంలో ఛాన్స్ లు అందుకుంటున్నారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. లఘు చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ''మేధావులు'' అనే ఓ ఆసక్తికమైన షార్ట్ ఫిల్మ్ రాబోతోంది. 'తెలివైన వాళ్ళకి అతి తెలివైన వాళ్ళకి మధ్యలో ఉన్నోళ్లే మేధావులు' అనే లైన్ తో టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ బొరుసు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది త్వరలోనే యూట్యూబ్ వేదికగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా ట్రైలర్ అనౌన్స్ మెంట్ వీడియో గ్లింప్స్ ను సోషల్ మీడియాలో వదిలారు.
''మేధావులు'' అనేది ముగ్గురు జర్నలిస్టుల గురించి తెలియజేసే క్రైమ్-డ్రామెడీ షార్ట్ ఫిల్మ్. ఎలాంటి రసవత్తరమైన క్రైమ్ స్టోరీలు దొరక్కపోవడంతో, వారు తమ జీవితాలతో విసిగిపోయారు. తమ తెలివితేటలను నిరూపించుకోవడాని వారు ఒక అధ్బుతమైన బ్యాంక్ దోపిడీ ప్లాన్ చేసినట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. 'స్మార్ట్ గాడిదలా లేదా మూగ గాడిదలా?' అనే క్యాప్షన్‌తో పోస్టర్ చాలా క్రియేటివ్ గా డిజైన్ చేయబడింది. ఇది ఈ షార్ట్ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
గ్లింప్స్ లోకి వెళ్తే, ఒక కారులో ముగ్గురు ప్రయాణిస్తుండగా.. 'ఒక మేధావి రాబరీ చేస్తే ఎలా ఉంటుందో చెప్పమంటావా?' అని ఒకతను అంటాడు. 'ఎంత కొట్టేస్తాం అన్నా?' అని పక్కనే ఉన్న వ్యక్తి అడగ్గా.. 'ఒక్క రూపాయి కూడా కొట్టేయకుండా మనం బయటకి వచ్చేస్తాం, అదే మన గేమ్' అని బదులిస్తాడు. డబ్బులు దొంగతనం చేయకుండా వస్తే అసలు అది రాబరీ ఎలా అవుతుంది? వాళ్ళ ముగ్గురి ప్లానింగ్ ఏంటి? అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే రేపు సాయంత్రం 4 గంటలకు ఈ షార్ట్ మూవీ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.
"మేధావులు'' మూవీలో మణికాంత్ దునక, మిమిక్రీ జితేంద్ర, సూరజ్ పాల్ క్రిస్టోఫర్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ వెంకట్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అన్వేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శశాంక్ మాలి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఖేల్‌పీడియా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మరి ఆసక్తికరమైన లఘు చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.