వివి వినాయక్.. వీడియోతో సడన్ ట్విస్ట్
వి.వి. వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరిగా కొనసాగిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 1 Jun 2024 3:32 AM GMTవి.వి. వినాయక్ ఒకప్పుడు టాలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరిగా కొనసాగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి లాంటి అగ్ర దర్శకుల కంటే ముందే బాక్సాఫీస్ వద్ద మాస్ బలాన్ని చూపించారు. వరుసగా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన వినాయక్, ఈ మధ్యకాలంలో మాత్రం తెలుగులో సినిమాలు చేయడం మానేశారు. ఆ మధ్య కొన్ని ప్రాజెక్టులపై కొన్ని చర్చలు జరిగినప్పటికీ ఎందుకో సెట్టవ్వలేదు.
ఇక ఇటీవలి కాలంలో, వినాయక్ ఆరోగ్యంపై వచ్చిన వార్తలు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ప్రచారం సాగింది. ఈ విషయంపై వినాయక్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన లేదు. ఇక శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా, వినాయక్ తన అనుభవాలు పంచుకోవడానికి ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో ఆయన కృష్ణతో తన అనుబంధం గురించి, ఆయనతో పని చేసిన అనుభవాలు వివరించారు. కృష్ణకు నివాళి అర్పించడం మాత్రమే కాకుండా, తన అనారోగ్యంపై క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియోను విడుదల చేసి ఉంటారని భావిస్తున్నారు. వీడియోలో వినాయక్ కాస్త డల్లుగా కనిపించారు, ఎక్కువ మాట్లాడలేకపోయారు.
ఇక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న స్థితిలో లేనని స్పష్టంగా చెప్పకపోయినా, ప్రస్తుతం కొంత ఇబ్బంది పడుతున్నారని మాత్రం అర్థమవుతుంది. వినాయక్ చివరిసారిగా హిందీలో 'ఛత్రపతి' రీమేక్ దర్శకత్వం వహించారు. ఆ ప్రాజెక్ట్ తర్వాత, తెలుగులో సినిమా చేయాలనుకున్నప్పటికీ, ఏదీ కుదరలేదు. గతంలో 'సీనయ్య' పేరుతో వినాయక్ హీరోగా ఓ సినిమా మొదలై ఆగిపోయింది.
ఆ ప్రాజెక్టు కోసమే వినాయక్ జిమ్ వర్కౌట్స్ చేసి కొంత బరువు కూడా తగ్గారు. మొత్తంగా న్యూ లుక్ లోకి వచ్చి కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని రోజులకే ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. అనుకున్నట్లు రాకపోవడంతో దిల్ రాజు మధ్యలోనే ఆ సినిమా షూటింగ్ ఆపేశారు. ఇక వినాయక్ దర్శకుడిగా గత వైభవం తిరిగి అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి వచ్చే రోజుల్లో ఆయన నుంచి మరిన్ని ప్రాజెక్ట్‌లు ప్రకటించే అవకాశముంది. ఈ క్రమంలో, ఆయన ఆరోగ్యం మెరుగై, మళ్లీ తెరపై మెరవాలని అభిమానులు ఆశిస్తున్నారు.