ఓటీటీపై డైరెక్టర్ వి.వి.వినాయక్ సంచలన వ్యాఖ్యలు
ఓటీటీ అందుబాటులోకి వచ్చాక థియేటర్ రిలీజ్ అయినా జనాలు పెద్దగా రావడం లేదని ఇప్పటికే పలువురు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jan 2024 12:30 PM GMTఓటీటీ అందుబాటులోకి వచ్చాక థియేటర్ రిలీజ్ అయినా జనాలు పెద్దగా రావడం లేదని ఇప్పటికే పలువురు అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఓటీటీ రిలీజ్ తో కొంతమంది దర్శక-నిర్మాతలు ఏకీభవిస్తే మరికొంత మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీ రిలీజ్ తో సినిమా కిల్ అవుతుందని వాదించిన వారెంతో మంది. తాజాగా ఓటీటీ రిలీజ్ లపై దర్శకుడు వి. వి. వినాయక్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
నాటకానికి సినిమా ఎలా శత్రువైందో? ఇప్పుడు సినిమాకి ఓటీటీ అలా శత్రువైందని పోల్చారు. ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సినిమా కళ తప్పిందన్నారు. సినిమా ప్లాప్ అయితే దర్శకుడి గురించి దారుణంగా మాట్లాడుతున్నారని.. అదే హిట్ అయితే క్రెడిట్ కొద్దిగానే ఇస్తున్నారన్నారు. రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ ఎన్నో హిట్ ప్లాప్ సినిమాలు తీసారు. కానీ ఈ వేరియషన్స్ అప్పుడుండేవి కాదన్నారు.
ఇప్పటి డైరెక్టర్లని ఇష్టాను సారం తిడుతున్నారు. ఏ డైరెక్టర్ అయినా అన్ని ఆలోచించే సినిమా చేస్తాడు. ఎవరూ కావాలని ప్లాప్ సినిమా చేయరు. కంటెంట్ ఉంటేనే చూడటం అన్నది ఇప్పుడొచ్చిన ట్రెండ్ కాదు ఎప్పటి నుంచో ఉందన్నారు. సినిమా బాగుంటే థియేటర్ కి వెళ్లి చూడాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఓటీటీ వచ్చాక కాస్త తగ్గారన్నారు. ఇప్పటికిప్పుడు సినిమా చూడాలి అన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదన్నారు.
ఓటీటీలో వస్తుంది కదా? అన్న ధీమాలో ఉంటున్నారన్నారు. ఓటీటీ వస్తే నిర్మాత సేఫ్ లో ఉంటారని అనుకున్నారు? కానీ ఓటీటీలు సినిమా హిట్ అయితే పుల్ అమౌంట్ ఇస్తున్నాయి. లేదంటే సగమిచ్చి సరిపెట్టుకోమంటున్నారు. ముందు ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఒకప్పుడు హిట్ సినిమాతో థియేటర్లు కళకళలాడేవి. ఇప్పుడు థియేటర్లో 30 మంది కూడా ఉండటం లేదు. మొదటి రెండు రోజుల్లో నిండుగా ఉంటున్నాయి. తర్వాత ఎలాంటి సినిమా అయినా ఖాళీగా కనిపిస్తుంది. ఇది చూసి బాధగానూ అనిపిస్తుందన్నారు. ఒకప్పుడు థియేటర్ల వద్ద బోలెడంత హంగామా కనిపించేది. ఇప్పుడా హంగామా ఏ సినిమాకి కనిపించడం లేదన్నారు వినాయక్.