'ఆ పర్సన్ తో మాకేం సంబంధం లేదు'.. వైజయంతీ మూవీస్ ప్రకటన
సినిమా నిర్మాణం విషయంలో అస్సలు రాజీపడరనే మార్క్ సంపాదించుకుంది.
By: Tupaki Desk | 6 Feb 2025 10:39 AM GMTటాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ గురించి అందరికీ తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా 50 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ తనదైన ముద్ర వేసుకుంది. సినిమా నిర్మాణం విషయంలో అస్సలు రాజీపడరనే మార్క్ సంపాదించుకుంది. భారీ సినిమాలను తీసుకొచ్చింది.
అయితే రీసెంట్ గా తమ సంస్థలో పని చేసే వ్యక్తి అరెస్ట్ అంటూ వచ్చిన పలు వార్తలపై స్పందించింది వైజయంతీ మూవీస్. ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి అరెస్ట్ అయిన నీలేష్ చోప్రా అనే వ్యక్తితో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో గురువారం పోస్ట్ పెట్టింది.
ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న నీలేష్ చోప్రా అనే వ్యక్తిని ఎస్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తమ సంస్థ దృష్టికి వచ్చిందని తెలిపింది. వైజయంతీ మూవీస్ కార్యాలయంలో సదరు వ్యక్తి ఇప్పటి వరకు ఎప్పుడూ వర్క్ చేయలేదని స్పష్టం చేసింది. అతడితో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.
ఆ విషయంపై పోలీసు అధికారులతో తాము చర్చించామని వైజయంతీ మూవీస్ పేర్కొంది. ముఖ్యంగా ఏ విషయాన్ని ప్రచురించే ముందు నిజానిజాలు చెక్ చేసుకోవాల్సిందిగా.. పూర్తిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపింది. ఆ విషయంలో మీడియాను కోరింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక వైజయంతీ మూవీస్ విషయానికొస్తే.. సీనియర్ ఎన్టీఆర్ తో చేసిన మూవీతో బ్యానర్ ను ప్రారంభించిన నిర్మాత అశ్వనీదత్.. ఆ తర్వాత అనేక సినిమాలు రూపొందించారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ను ఆయనే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. స్వప్న సినిమాస్ బ్యానర్ పై తారక్ కు ఫస్ట్ హిట్ అందించారు.
చూడాలని ఉంది, ఇంద్ర, కంపెనీ (హిందీ), సీతారామం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతోపాటు పెళ్లి సందడి, శుభలగ్నం చిత్రాలు, కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ను ప్రేక్షకులకు అందించారు. సావిత్రి బయోపిక్ మహానటి రూపొందించి మంచి విజయంతోపాటు అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా ప్రభాస్ తో కల్కి 2898 ఏడీ తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు కల్కి సీక్వెల్ తో పాటు పలు సినిమాలు రూపొందిస్తున్నారు!