లైన్ క్లియర్.. ఆర్జీవీ వ్యూహం రిలీజ్ అప్పుడే
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాల నేపథ్యంతో వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 8 Feb 2024 1:26 PM GMTటాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాల నేపథ్యంతో వ్యూహం, శపథం సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో మొదటి చిత్రం వ్యూహం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వేయడంతో.. రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. జనవరి 11వ తేదీకి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ అప్పటికీ విడుదలకు హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రాకపోవడంతో రిలీజ్ కాలేదు. అయితే వర్మ మాత్రం ఈ సినిమాను విడుదల చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. షాక్ లు తగులుతున్నా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.
తెలంగాణ హైకోర్టు సూచనలతో సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేటును జారీ చేసింది సెన్సార్ బోర్డు. దీంతో ఈనెల 16వ తేదీన వ్యూహం సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత సిద్ధం చేసుకున్నారు. కాగా రెండు నెలల క్రితమే సినిమాను పూర్తి చేసుకున్న చిత్ర బృందం.. సెన్సార్ సర్టిఫికేటును సాధించి విడుదలకు సిద్ధం చేసింది.
ట్రైలర్ లో కొన్ని సీన్లు ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో పాటు మరికొందరు సినిమాను విడుదల చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. చిత్ర నిర్మాత, దర్శకుడు తదితరులు కోర్టును ఆశ్రయించడంతో దానికి ప్రతిగా పిటిషన్ లు దాఖలు కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.
ఇంకోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేటును జారీ చేయవలసిందిగా ఆదేశించడంతో సెన్సార్ బోర్డు సినిమాకు యూ సర్టిఫికేటును జారీ చేసింది. ఇక ఈ మూవీని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించగా... అజ్మల్ అమీర్, ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏం అవుతుందో.