ఒక్క హిట్ లేకున్నా చేతిలో ఏడు సినిమాలు..!
ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని ఈ అమ్మడు సొంతం చేసుకోలేక పోయింది.
By: Tupaki Desk | 23 Jan 2025 2:30 PM GMTదాదాపు పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో సుధీర్ బాబు హీరోగా నటించిన 'భలే మంచి రోజు' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ వామికా గబ్బీ. ఈ అమ్మడు అందం విషయంలో ఆకట్టుకున్నా, ఆ సినిమా ఫలితం నిరాశ పరచడంతో టాలీవుడ్‌లో ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు దక్కలేదు. టాలీవుడ్ నుంచి ఒకటి రెండు చిన్నా చితక ఆఫర్లు వచ్చినా ఈ అమ్మడు పట్టించుకోలేదు. అయితే తెలుగులో కాకుండా ఈ అమ్మడు ఇతర భాషల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. పంజాబీ సినిమాలతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని ఈ అమ్మడు సొంతం చేసుకోలేక పోయింది. అయినా ఆఫర్ల విషయంలో ఈ అమ్మడికి కొదవ లేదు.
ఈ అమ్మడు ప్రస్తుతం చాలా బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటిస్తోంది. గత ఏడాది ఈ అమ్మడు నటించిన సినిమా బేబీ జాన్ ఒక్కటే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ ఏడాది మాత్రం ఈమె నటిస్తున్న ఐదు ఆరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె కిటీలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి పంజాబీ మూవీ కాగా, రెండు తమిళ్ సినిమాలు, రెండు హిందీ సినిమాలు, ఒకటి తెలుగు, మరోటి మలయాళం. మొత్తం ఐదు భాషల్లో ఈ అమ్మడు ప్రస్తుతం సినిమాలు చేస్తుంది. ఈ స్థాయిలో ఒకే సారి ఐదు భాషల సినిమాలను చేతిలో పెట్టుకున్న ఘనత మరే హీరోయిన్‌కి దక్కలేదు.
గత ఏడాది మొదలైన రెండు మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా కిక్లి అనే పంజాబీ సినిమా ఉంది. హిందీలోనూ ఈమె నటిస్తున్న సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో ఈమె గూఢచారి 2 సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తక్కువ సమయంలోనే ఈ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ అమ్మడి క్రేజ్‌ను ఈ సినిమాలు అమాంతం పెంచడం ఖాయం అని, వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు కచ్చితంగా మరిన్ని సినిమాలతో రావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
తెలుగులో ఈమె నటించిన భలే మంచి రోజు విడుదల అయ్యి దాదాపు పదేళ్లు కాబోతుంది. తిరిగి ఇన్నాళ్ల తర్వాత గూఢచారి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అప్పుడు నిరాశ పరచిన ఈమె ఈసారి సక్సెస్‌తో ఆకట్టుకుంటుందో చూడాలి. అడవి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. గూఢచారి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండి హిట్ టాక్ దక్కించుకుంటే టాలీవుడ్‌లో వామికా గబ్బీ బిజీ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.