లోపం అభిమానుల్లో ఉందా మ్యాడమ్?
ఇప్పుడు మరో డిజాస్టర్ విషయంలో అభిమానులకు తిట్లు చీవాట్లు ఎదురయ్యాయి. అలా తిట్టింది మరెవరో కాదు.. ఆ సినిమాని నిర్మించిన నిర్మాత భార్య.
By: Tupaki Desk | 4 April 2025 4:12 AMఇటీవలే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బాగా ఆడుతున్న సినిమాని ట్వీట్లతో నాశనం చేస్తున్నారని మీడియాను సమావేశ పరిచి మరీ తిట్టారు. అసలు మీడియాతో మాకేం పని లేదు. మీరు మా ఇంటర్వ్యూలు వేయకండి. మీరు రాస్తేనే మా సినిమాలు ప్రజలు చూడరు! అని ఘోరంగా తిట్టారు.
ఇప్పుడు మరో డిజాస్టర్ విషయంలో అభిమానులకు తిట్లు చీవాట్లు ఎదురయ్యాయి. అలా తిట్టింది మరెవరో కాదు.. ఆ సినిమాని నిర్మించిన నిర్మాత భార్య. పేరు వార్ధా ఖాన్. `సికందర్` నిర్మాత సాజిద్ ఖాన్ సతీమణి. సల్మాన్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన సికందర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవ్వడమే గాక, రొటీన్ సినిమాలో నటించినందుకు సల్మాన్ అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. ఇలాంటి చెత్త సినిమాలో నటించాలని సల్మాన్ ని ఒప్పించింది అంటూ నిర్మాత సాజిద్ ఖాన్ భార్య వార్ధా ఖాన్ ని ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే దీనికి తట్టుకోలేకపోయన వార్ధా బరస్ట్ అయ్యారు. ఎక్స్ ఖాతాలో మాటల యుద్ధం ముదిరింది. సికందర్ గురించి సానుకూల సమీక్షలను షేర్ చేస్తూ.. కోపోద్రిక్తులైన వార్ధా ఖాన్.. సల్మాన్ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యారు. ఫ్యాన్స్ సరిగా అర్థం చేసుకోలేదని..తప్పుగా డిఫైన్ చేస్తున్నారని ఫ్యాన్స్ పై వార్ధా ఆరోపించారు. ``కొంచెం సిగ్గుపడండి.. సల్మాన్ ఖాన్ కెరీర్‌ను నాశనం చేసే వరకు మీరు ఆగరా?`` అని తనను ప్రశ్నించిన అభిమానిపైనా వార్ధా ఫైరయ్యారు. అభిమానులపై వార్ధా విరుచుకుపడిన పోస్టుల స్క్రీన్ షాట్లు వేగంగా వైరల్ అయ్యాయి. స్క్రీన్‌షాట్‌లు రెడ్డిట్‌లో చర్చగా మారాయి. అయితే కాసేపటికే.. వార్దా తన ఆవేశపూరిత ప్రతిస్పందనలను చాలావరకు తొలగించడం మరింత పెద్ద చర్చకు తెర తీసింది.
ఇకపై సల్మాన్ ఖాన్ తన స్క్రిప్ట్‌లను, దర్శకులను ఎంచుకోవడానికి మరింత జాగ్రత్త వహించాలని కొందరు అభిమానులు సూచించారు. అయితే ఇంత జరిగినా దీంతో సంబంధం లేకుండా వార్దా `సికందర్`ను సానుకూల దృక్పథంలో ప్రమోట్ చేస్తూనే ఉంది. ఈద్ రోజున విడుదలైన సికందర్ నాలుగు రోజుల్లో ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ. 84 కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 141.15 కోట్లు వసూలు చేసింది. కానీ కంటెంట్ తీవ్రంగా నిరాశపరిచిందంటూ సమీక్షకులు విమర్శించారు. సోమవారం నుంచి భారీగా వసూళ్లు పడిపోయాయని ట్రేడ్ చెబుతోంది.