'పుష్ప 2' ట్రైలర్ నుంచి ఏం ఆశిస్తున్నారు?
ఎట్టకేలకు 'పుష్ప 2' నిర్మాణానంతర పనుల గురించి, థియేట్రికల్ ట్రైలర్ గురించి క్లారిటీ వచ్చే సమయం ఆసన్నమైంది.
By: Tupaki Desk | 8 Oct 2024 3:40 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ బృందం ఎప్పటికైనా అతిపెద్ద హంగామా కోసం సర్వసన్నాహకాల్లో ఉన్నారు. హై-బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'పుష్ప- ది రూల్' భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాలలో ఒకటి. ముఖ్యంగా సౌత్‌తో పాటు ఉత్తరాదినా ఈ చిత్రంపై చాలా ఉత్కంఠ నెలకొంది. పుష్పరాజ్ స్టైల్, ఆహార్యం, మాసిజం, డ్యాన్సులు ఇలా ప్రతిదానిని ఉత్తరాది ప్రజలు ఆరాధించారు. అందుకే ఈ మూవీ కోసం తెలుగు తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకుల కంటే హిందీ ఆడియెన్ ని ఎంతగానో ఎగ్జయిట్ చేస్తోందని చెప్పాలి. రొటీన్ ఫార్ములాటిక్ సినిమాలతో విసిగిపోయిన ప్రజలకు సాంత్వన చేకూర్చే మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా పుష్ప 2 సంచలనం సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో 500కోట్లు లేదా అంతకుమించి వసూల్ చేయాలనే లక్ష్యం బలంగా ఉంది. అందుకే పుష్ప 1 కంటే అత్యంత భారీ బడ్జెట్ ని ఈ మూవీ కోసం వెచ్చించారు. కాన్వాస్ ని అమాంతం మార్చారు. అందుకే ఇప్పుడు ఈ సినిమా రాక కోసం అందరిలో ఒకటే ఉత్కంఠ.
ఎట్టకేలకు 'పుష్ప 2' నిర్మాణానంతర పనుల గురించి, థియేట్రికల్ ట్రైలర్ గురించి క్లారిటీ వచ్చే సమయం ఆసన్నమైంది. మోస్ట్ అవైటెడ్ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుండగా, మూడు వారాల ముందుగానే ట్రైలర్‌ను విడుదల చేయడం వల్ల మార్కెట్ వర్గాల్లో బలమైన బజ్‌ను సృష్టించాలనేది ప్లాన్. 'పుష్ప 2' ట్రైలర్ నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారో అలాంటి అన్ని అంశాలు ఉంటాయని కూడా గుసగుస వినిపిస్తోంది.
పుష్ప 1 పాన్ ఇండియాలో భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు 350కోట్లు వసూలు చేసింది. పుష్ప 2 అంతకు నాలుగు రెట్లు ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నారు. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 పోస్టర్ల దశనుంచే ఆసక్తిని పెంచగలిగాడు. ట్రైలర్ తో దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రభావాన్ని సృష్టించడానికి కచ్ఛితత్వంతో పని చేస్తున్నాడని సమాచారం. 'పుష్ప 2' ప్రపంచం 'పుష్ప ది రైజ్' కంటే కనీసం పది రెట్లు పెద్దదిగా, గ్రాండ్ గా ఉంటుందని ..దానికోసం చిత్రబృందం చాలా హార్డ్ వర్క్ చేసిందని సమాచారం.
పుష్ప 2లో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫహద్ ఈ చిత్రంలో కఠినమైన ఫారెస్ట్ అధికారిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ భారతీయ పంపిణీ సంస్థలు AA ఫిల్మ్స్ (హిందీ), E4 ఎంటర్‌టైన్‌మెంట్ (మలయాళం), N సినిమాస్ ( కన్నడ), ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (తమిళం) ఆయా భాషల్లో సినిమాను విడుదల చేయనున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.