మార్చి అలా.. ఏప్రిల్ ఇలా.. మే ఎలా ఉంటుందో?
మార్చిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టగా.. ఏప్రిల్ చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి.
By: Tupaki Desk | 2 May 2024 5:30 PM GMTసాధారణంగా సమ్మర్ సీజన్ అంటే కొత్త కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుంటాయి. అన్ని తరగతుల విద్యార్థులు పరీక్షలు పూర్తి చేసుకుని హాలిడేస్ ఎంజాయ్ చేసే టైం కావడంతో, దీన్ని క్యాష్ చేసుకోడానికి పెద్ద సినిమాలను విడుదల చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. వేసవిలో ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి కానీ, స్టార్ హీరోలెవరూ సందడి చేయలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి చిన్న మీడియం రేంజ్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. మార్చిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టగా.. ఏప్రిల్ చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశ పరిచాయి.
మార్చి నెలలో మహా శివరాత్రి పండగ సందర్భంగా విడుదలైన 'గామి' సినిమా విజయం సాధించింది. అదే సమయంలో వచ్చిన మలయాళ డబ్బింగ్ మూవీ 'ప్రేమలు' సైతం తెలుగులో బాగా ఆడింది. 10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, టాలీవుడ్ లో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. మూడో వారంలో రిలీజైన 'ఓం భీమ్ బుష్' సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. నెలాఖరున వచ్చిన 'టిల్లు స్క్వేర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 'డీజే టిల్లు' సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ రూ. 125 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదే నెలలో విడుదలైన 'ఆపరేషన్ వాలంటైన్' 'భీమా' లాంటి మరికొన్ని చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి.
'ది ఫ్యామిలీ స్టార్' సినిమాతో ఏప్రిల్ నెల ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అందరూ భావించారు. దిల్ రాజు బ్యానర్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మూడు వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ చిత్రానికి డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ మంచి రెస్పాన్స్ రాలేదు. 'ఫ్యామిలీ స్టార్' కు పోటీగా థియేటర్లలోకి వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా, తెలుగులో మాత్రం పెద్దగా వసూళ్లు అందుకోలేదు.
ఏప్రిల్ రెండో వారంలో రిలీజైన అంజలి 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ , మైత్రీ మూవీ మేకర్స్ వంటి టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ సపోర్ట్ తో వచ్చిన 'డియర్', 'లవ్ గురు' లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో అంతగా ఆడలేదు. సుహాస్, కార్తీక్‌రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ కలిసి నటించిన 'శ్రీరంగనీతులు' మూవీ కూడా ప్లాప్ అయ్యింది. మూడో వారంలో విడుదలైన టెనెంట్, మార్కెట్ మహాలక్ష్మి, పారిజాతపర్వం, శరపంజరం, తెప్పసముద్రం లాంటి చిన్న సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. చివరి వారంలో వచ్చిన విశాల్ 'రత్నం' సినిమా తొలి రోజే తుస్సుమంది.
ఈ విధంగా ఏప్రిల్ లో వచ్చిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. నిజానికి గత నాలుగేళ్ల నుంచీ ఏప్రిల్ నెల తెలుగు సినిమాలకు పెద్దగా కలిసి రావడం లేదు. గమనిస్తే హిట్లు కంటే భారీ ప్లాపులే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈసారి కూడా నిరాశే ఎదురవ్వడంతో ఇప్పుడు మే నెలపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' మూవీ వెనక్కి తగ్గినా.. బోసిపోయిన సమ్మర్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొచ్చే సినిమాలు పడతాయని భావిస్తున్నారు.
మే 3వ తారీఖున అల్లరి నరేష్ 'ఆ ఒక్కటి అడక్కు', సుహాస్ 'ప్రసన్న వదనం', వరలక్ష్మి శరత్ కుమార్ 'శబరి', తమన్నా - రాశీ ఖన్నా నటించిన 'బాక్' వంటి నాలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మే 10న సత్యదేవ్ 'కృష్ణమ్మ' చిత్రంతో వస్తుంటే, మే 17న విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ విడుదల కాబోతోంది. నెలాఖరున దిల్ రాజు బ్యానర్ నుంచి 'లవ్ మీ', సుధీర్ బాబు నటిస్తోన్న 'హరోం హర', ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' సినిమాలు రాబోతున్నాయి. మరి వీటిల్లో ఏయే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటాయో వేచి చూడాలి.