జైల్లో కన్నడ స్టార్ దర్శన్.. ఆ 100 కోట్ల సంగతేంటి?
ప్రస్తుతం ఆ ఇద్దరితో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేసి కస్టడీలో పోలీసులు విచారిస్తున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2024 4:46 AM GMTకన్నడ స్టార్ హీరో దర్శన్ తన ప్రియురాలి కోసం నేరం చేసి దొరికిపోయాడని మీడియాల్లో కథనాలొస్తున్నాయి. అభిమాని హత్య కేసులో అతడు ఏ2గా ఉన్నాడు. తనను ప్రేరేపించిన ప్రియరాలు పవిత్ర గౌడ ఏ1 గా ఈ కేసులో చిక్కుకుంది. ప్రస్తుతం ఆ ఇద్దరితో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేసి కస్టడీలో పోలీసులు విచారిస్తున్నారు.
అయితే విచారణలో దర్శన్ చెప్పిన దానికి వాస్తవంగా లొకేషన్ లో దొరికిన ఆధారాలు, గ్యాంగ్ సభ్యులు చెప్పిన వివరాలను పోలిస్తే అస్సలు పొంతనే కుదరడం లేదని పోలీసులు భావిస్తున్నారట. నిజానికి అభిమాని రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన సంగతి తనకు తెలియదని, ఎలానూ తీసుకుని వచ్చారు గనుక పవిత్ర సమక్షంలో హెచ్చరించి వదిలేద్దామనుకున్నానని, తాను ఫ్యాన్ ని పిలిపించినా కానీ, తనకు భోజనం చేసి వెళ్లిపోవాల్సిందిగా కొంత డబ్బు కూడా ఇచ్చానని దర్శన్ విచారణలో చెప్పినట్టు ఓ కథనం వెలువడింది.
అయితే ఇదంతా లాయర్ మాట్లాడించిన స్క్రిప్టు అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు దర్శన్ ని నమ్ముకుని పెట్టుబడిగా పెట్టిన నిర్మాతలు లబోదిబోమంటున్నారని కన్నడ మీడియా చెబుతోంది. అతడిపై సుమారు 100 కోట్ల మేర నిర్మాతలు పెట్టుబడులు పెట్టారని, సినిమాలు మధ్యలో ఉన్నాయని కూడా చెబుతున్నారు.
రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీపతో పాటు అతని స్నేహితురాలు పవిత్ర గౌడ, మరో పదకొండు మందిని పోలీసు కస్టడీని బెంగళూరు కోర్టు శనివారం మరో ఐదు రోజులు పొడిగించింది. పిటిఐ కథనం ప్రకారం.. వారి ఆరు రోజుల పోలీసు కస్టడీ ఆదివారంతో ముగుస్తుంది కాబట్టి వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆది, సోమవారాలు (బక్రీద్) సెలవు దినం కావడంతో కోర్టు వారిని న్యాయమూర్తి విశ్వనాథ్ సి గౌడర్ ఎదుట హాజరుపరచాలని నిర్ణయించారు. దీంతో దర్శన్, గౌడ తదితరులపై జూన్ 20 వరకు పోలీసు కస్టడీ కొనసాగనుంది.
దర్శన్ తదితరుల న్యాయవాదులు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును అభ్యర్థించారు. అయితే మృతుడిని చిత్రహింసలకు గురిచేసిన కీలకమైన ఆధారాలు, సామగ్రిని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని, అందువల్ల పోలీసు కస్టడీని పొడిగించాలని దర్యాప్తు బృందం కోర్టును అభ్యర్థించింది.
ఇరువైపులా విన్నపాలు విన్న అనంతరం 21వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టు పోలీసు కస్టడీని మంజూరు చేసింది.
30 లక్షలు చేతులు మారాయి
అయితే ఈ కేసులో అభిమాని రేణుకాస్వామిని షెడ్డుకు తీసుకువెళ్లి అత్యంత కిరాతకంగా చక్క దుంగలతో మోది, అతడి తలను గూడ్స్ ఆటోకి వేసి బాది, మర్మావయవాలపై గాయం చేసి చంపారని ప్రత్యక్ష గ్యాంగ్ సభ్యులు వెల్లడించినట్టు పోలీసులు చెబుతున్నారు. అలాగే అతడి శరీరంపై 15 చోట్ల కమిలిపోయిన గాయాలున్నాయని పోస్ట్ రిపోర్ట్ ల్లో వెల్లడైంది. ఈ దారుణానికి ఒడికట్టిన గూండాల కోసం 30లక్షలు చెల్లించారని కూడా కథనాలొచ్చాయి. నిజానికి రేణుకా స్వామి చనిపోయాడని తెలిసాక ఈ కేసు తనపైకి రాకుండా మ్యానిప్యులేట్ చేసేందుకు దర్శన్ కు ఒక పోలీస్ అధికారి సహకరించారట. ఆ 30లక్షలు తీసుకున్న వ్యక్తులు కేసును తమపై వేసుకునేందుకు అంగీకరించారని కూడా పోలీసులు చెబుతున్నారు. నిజానికి తాను ఒత్తిడి చేసి ఉండకపోతే దర్శన్ ఇలా చేసేవాడు కాదని పవిత్ర గౌడ ఎంతో ఆవేదన చెందిందని కూడా పోలీసులు వెల్లడించినట్టు కన్నడ మీడియాలో కథనాలొచ్చాయి. అయితే దర్శన్ పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలం దీనికి చాలా భిన్నంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.