Begin typing your search above and press return to search.

'గద్దర్' అవార్డులు సరే, 'నంది' అవార్డుల సంగతేంటి మరి?

ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ)తో చర్చించామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ తాజాగా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.

By:  Tupaki Desk   |   31 July 2024 5:06 PM GMT
గద్దర్ అవార్డులు సరే, నంది అవార్డుల సంగతేంటి మరి?
X

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 'గద్దర్ అవార్డ్స్'కు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సీనియర్ హీరో చిరంజీవి స్పందిస్తూ తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత తీసుకోవాలని కోరుతూ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డులపై తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ)తో చర్చించామని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ తాజాగా వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి.

తెలంగాణా రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి పేర్కొన్నాయి. గద్దర్ అవార్డుల కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరామని.. ఆ కమిటీ ద్వారా విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపాయి. గద్దర్ అవార్డుల గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో.. నంది పురస్కారాల సంగతేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి.

టాలీవుడ్ కు నంది అవార్డులను ప్రతిష్టాత్మకమైన పురస్కారాలుగా భావించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో 1998 నుంచి ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తూ వచ్చింది. సినిమాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాలను ప్రధానం చేస్తూ వచ్చారు. అప్పట్లో హైదరాబాద్ కేంద్రంగా ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉండేవి. అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఈ అవార్డులు ప్రశ్నార్థకంగా మారాయి.

నిజానికి రాష్ట్ర విభజన అనంతరం, ఏపీలో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014, 2015, 2016 సంవత్సరాలకి గానూ 2017లో నంది అవార్డులను ప్రకటించారు. అప్పుడు ప్రభుత్వం పక్షపాతంతో అవార్డులను ప్రకటించిందని, తమకు నచ్చిన వారినే ఎంపిక చేశారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగలేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ కళాకారులకు స్టేట్ అవార్డులు ఇస్తామని చెప్పింది కానీ, ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019 సంవత్సరానికి నందులు అందిస్తామని చెప్పారు.

2020 జూన్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దల బృందం భేటీ అయిన సందర్భంగా, ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల ప్రధానోత్సవంపై హామీ ఇచ్చారు. 2019-20 సంవత్సరానికి పురస్కారాలు ఇవ్వడానికి సీఎం సుముఖుత వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళికి నంది అవార్డుల బాధ్యతలను అప్పగించారు. అయితే ఒకేసారి డ్రామా, టీవీ, సినీ రంగాలకు అవార్డులు ఇవ్వడం కష్టం కాబట్టి.. ముందుగా నాటకాలకు అందిస్తామని, ఆ తర్వాత మిగతా రంగాలకు పురస్కారాలు ఇస్తామని పోసాని కృష్ణమురళి ఓ సందర్భంలో తెలిపారు. కానీ ఎన్నికలు దగ్గర పడిన తర్వాత ఎవరూ అవార్డుల ఊసే ఎత్తలేదు.

ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఎంఎల్ఏగా ఉన్నారు. కాబట్టి నంది అవార్డులను పునరుద్దరించే దిశగా ఆలోచన చెయ్యాలని సినీ అభిమానులు కోరుతున్నారు. తెలంగాణలో గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, త్వరలో ఏపీలోనూ నంది అవార్డులపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, సినీ పెద్దలు ఆ దిశగా చర్చలు జరుపుతారేమో చూడాలి.