చిరంజీవి అవార్డును ఆర్జీవీ అలా అనేశారేమి?
దీనికి పరిశ్రమ సంబరాలు చేసుకుంటుండగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన షాకిచ్చింది.
By: Tupaki Desk | 27 Jan 2024 4:54 PM GMTమెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్ఠాత్మక పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం పద్మవిభూషణ్ పురస్కారం దక్కించుకున్న ఐదుగురిలో చిరంజీవి ఒకరు. ఈ అవార్డ్ భారతదేశంలో అసాధారణమైన, విశిష్ట సేవలు చేసేవారికి ప్రదానం చేసే రెండవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారంతో టాలీవుడ్ లో అరుదైన గౌరవం అందుకున్న నటుడిగా చిరు చరిత్ర సృష్టించారు. దీనికి పరిశ్రమ సంబరాలు చేసుకుంటుండగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందన షాకిచ్చింది.
రామ్ గోపాల్ వర్మ మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో తన నిర్వేదాన్ని వ్యక్తం చేసారు. ``నేను శ్రీ పద్మా సుబ్రహ్మణ్యం లేదా శ్రీ బిందేశ్వర్ పాఠక్ గురించి ఎప్పుడూ వినలేదు. మెగాస్టార్‌తో సమానమైన స్థితిలో వారిని ఉంచడానికి నేను అస్సలు థ్రిల్లింగ్ గా లేను. అవార్డుకు చిరంజీవి గారు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా నటిస్తాను``అని అన్నారు.
పద్మా సుబ్రహ్మణ్యం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్య కళాకారిణి అయితే, బిందేశ్వర్ పాఠక్ ఒక సామాజిక శాస్త్రవేత్త కం సామాజిక వ్యవస్థాపకుడు. గత సంవత్సరం ఆగస్టులో మరణించారు. ఇప్పుడు ఆర్జీవీ వారి పేర్లను ఎందుకు తెరపైకి తెచ్చినట్టు? అన్నదే మెగాభిమానుల సందేహం? రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్య కొందరికి అంతగా నచ్చలేదు. వారు వర్మకు సూచనలిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని.. తన పరిధులను విస్తృతం చేసుకోవాలని కోరారు.
ఒక వ్యక్తి వర్మకు చీవాట్లు పెడుతూ ఇలా రాసాడు. ``మీరు బిందేశ్వర్ పాఠక్ గురించి మరింత చదవాలి. ఎందుకంటే మీ జ్ఞానం కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలకు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం అయింది`` అని అన్నారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, ``బిందేశ్వర్ పాఠక్ గురించి మీరు వినకపోతే అది మీ సమస్య. ఆయన సూపర్‌స్టార్ కంటే తక్కువ కాదు.. మీరు చెప్పేది మెగా స్టార్ గురించేనా`` అని అన్నారు.
పద్మవిభూషణ్ అందుకున్న సందర్భంగా మెగాస్టార్ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.