వేర్ ఈజ్ వీరమల్లు..?
ఎలాగు లేట్ అయ్యింది కదా అని సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
By: Tupaki Desk | 9 March 2025 8:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో భారీ రేంజ్ లో ప్రకటించిన సినిమా హరి హర వీరమల్లు. సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా మొదలై నాలుగేళ్లు పైన అవుతుంది. పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఇంకా ఈ సినిమా రిలీజ్ కాలేదు. మధ్యలో క్రిష్ ఇక ఈ ప్రాజెక్ట్ లో కొనసాగడం తన వల్ల కాదని వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి వీరమల్లు సినిమా జ్యోతి కృష్ణ చేతిలోకి వచ్చింది. ఎలాగు లేట్ అయ్యింది కదా అని సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
హరి హర వీరమల్లు పార్ట్ 1 మార్చి 28న రిలీజ్ ప్లాన్ చేశారు. దాదాపు ఏడాదిగా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం వాయిదా పడటం ఇదే రిపీట్ అవుతుంది. మార్చి 28 రిలీజ్ అనౌన్స్ చేసి ఈసారి రిలీజ్ పక్కా అని అన్నారు కానీ పరిస్థితి చూస్తుంటే ఈసారి కూడా సినిమా పోస్ట్ పోన్ గ్యారెంటీ అనిపించేలా ఉంది. సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ కోపరేషన్ అవసరం ఆయన ఏపీ అసెంబ్లీ సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు.
పవన్ పోర్షన్ పూర్తైనా కూడా డబ్బింగ్ పనులకైనా టైం కేటాయించాల్సి ఉంది. మార్చి 28 రిలీజ్ డేట్ అంటే చూస్తే ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. ఇంతవరకు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. ఆమధ్య రెండు పాటలను రిలీజ్ చేశారు కానీ మళ్లీ తర్వాత సైలెంట్ అయ్యారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వీరమల్లు మీద ఫోకస్ చేయడం మానేశారు. ఒక సినిమా ఇన్నాళ్లు సెట్స్ మీద ఉంటే ఫ్యాన్స్ కి కూడా ఆసక్తి ఉండదు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. మరి మార్చి 28 వీరమల్లు మొదటి పార్ట్ రిలీజ్ అని ప్రకటించగా ఇప్పటివరకు ఎలాంటి హడావిడి లేదు. మరి వీరమల్లు ఎక్కడ ఏం చేస్తున్నాడు సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ అయితే రావట్లేదు. సినిమా రాదనే ఉద్దేశ్యంతోనే నితిన్ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.
వీరమల్లు సినిమా మార్చి 28 మిస్సైతే మళ్లీ మరో డేట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిలీజ్ అనుకున్న డేట్ కే వచ్చేట్టు అయితే ఈపాటికి హంగామా మొదలవ్వాలి మరి వీరమల్లు క్రియేటర్స్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఈ కన్ ఫ్యూజన్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.