Begin typing your search above and press return to search.

కల్కి 2898 ఏడీ.. ఆ డీల్ ఇంకా సెట్టవ్వలేదా?

పలు చానెల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ డీల్ ఫైనల్ కాలేదని సమాచారం.

By:  Tupaki Desk   |   7 Oct 2024 2:30 AM GMT
కల్కి 2898 ఏడీ.. ఆ డీల్ ఇంకా సెట్టవ్వలేదా?
X

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి 2898 ఏడీ, వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా విడుదలై మూడు నెలలు దాటినా, ఓ కీలక విషయంలో మాత్రం ఇంకా ఇబ్బంది ఎదుర్కొంటుందనే టాక్ వినిపిస్తోంది. అది సినిమాకు సంబంధించిన శాటిలైట్ హక్కులు. పలు చానెల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ డీల్ ఫైనల్ కాలేదని సమాచారం.

ఈ సమస్య వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. సినిమా యూనిట్ డిమాండ్ చేస్తున్న రేటుకు, మరియు టీవీ చానెల్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ధరకు భారీ వ్యత్యాసం ఉండటంతో, డీల్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. స్టార్ మా, జీ గ్రూప్ వంటి ప్రముఖ చానెల్స్ తో చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఫలితంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెరుగుతున్న నేపథ్యంలో, టీవీ చానెల్స్ కు ఆదాయంలో తగ్గుదల చోటుచేసుకుంటోంది. ముఖ్యంగా, బిగ్ బడ్జెట్ సినిమాలు నాలుగు వారాల గ్యాప్‌లోనే ఓటీటీలో విడుదలవుతుండటంతో, ప్రేక్షకులు ఎక్కువగా టీవీ కంటే ఓటీటీ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో, టీవీ చానెల్స్ ద్వారా వచ్చే ఆదాయంలో తగ్గుదల ఉండటం సహజం.

అంతేకాకుండా, లీగల్ గా అప్రూవ్ కాకపోయినా, చాలా చోట్ల లోకల్ కేబుల్ ఆపరేటర్లు తమ ప్రైవేట్ ఛానెల్స్ ద్వారా సినిమాలను ప్రసారం చేస్తున్నారు, దీనివల్ల చందాదారులను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం కూడా శాటిలైట్ డీల్స్ ఆలస్యానికి కారణంగా భావించవచ్చు.

ఇప్పటివరకు ప్యాన్ ఇండియా సినిమాలకు ఓటీటీ ద్వారా వచ్చే ఆదాయం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల, నిర్మాతలు ముందుగా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుని, ఆ తర్వాతే శాటిలైట్ హక్కుల కోసం చర్చలు మొదలుపెడుతున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న సమయంలో, శాటిలైట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం సహజమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.

ఇది కేవలం కల్కి 2898 ఏడీ సినిమాకే పరిమితం కాకుండా, ప్యాన్ ఇండియా సినిమాలన్నింటికి కూడా ఎదురవుతున్న సమస్య. గతంలో టీవీ చానెల్స్ ద్వారా భారీ మొత్తంలో ఆదాయం అందినా, ఇప్పుడు ఆ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల చోటు చేసుకుంది. టీవీ సీరియల్స్‌కు వచ్చే ఆదరణను క్రమంగా సినిమాలు కోల్పోతున్నాయి. ఈ ట్రెండ్ ను మార్చడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.