నాగార్జున సెంచరీ రేసులో ఎంతమందంటే?
ఈ నేపథ్యంలో వందవ సినిమా ఛాన్స్ ఎవరు అందుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 18 March 2025 5:14 AMకింగ్ నాగార్జున సోలోగా నటించిన చిత్రాలు..ఇతర స్టార్ల చిత్రాల్లో భాగమైనవి మొత్తం కలిపితే సెంచరీ దాటే ఉండొచ్చు. అయితే సోలోగా చూస్తే నాగ్ ఇంకా సెంచరీ కొట్టలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వందవ సినిమా ఛాన్స్ ఎవరు అందుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ ఎప్పుడో సెంచరీలు కొట్టేసారు. విక్టరీ వెంకటేష్ సెంచరీకి ఇంకా చాలా దూరంలో ఉన్నారు.
ఆయన సెంచరీ కొట్టడానికి ఇంకాస్త సమయం పడుతుంది. దీంతో చిరు, బాలయ్య తర్వాత స్థానం నాగ్ తో కావడం విశేషం. అయితే ఆ సినిమా ఛాన్స్ ఎవరికిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. నాగార్జున సోలో సినిమా చేసి ఏడాది దాటి పోయింది. 'నా సామి రంగ' తర్వాత సోలో సినిమా ఇంత వరకూ ప్రకటించలేదు. ఇతర స్టార్లతో కలిసి 'కుభేర', 'కూలీ' చిత్రాలు చేస్తున్నారు తప్ప సోలో సినిమా సంగతేంటి? అంటే క్లారిటీ రావడం లేదు.
అయితే ఇప్పటికే నాగార్జునకు పూరి జగన్నాధ్, తమిళ డైరెక్టర్ నవీన్ లాంటి వాళ్లు స్టోరీలు చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్లతో నాగ్ కి సెట్ అయిందా? లేదా? అన్నది క్లారిటీ లేదు. అలాగే ప్రసన్న కుమార్ కూడా అప్పట్లో స్టోరీ చెప్పాడు. ఆ తర్వాత దానిపై కూడా క్లారిటీ లేదు. అలాగే `గాడ్ ఫాదర్` ఫేం మోహన్ రాజా కూడా నాగార్జునకు స్టోరీ నేరేట్ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ వీళ్లెవ్వరి గురించి నాగార్జున ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా 'నితం ఓరువానం' అనే సినిమా ద్వారా కార్తీక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలుగులో ఈ సినిమా 'ఆకాశం' టైటిల్ తో అనువాదమైంది. ఇది ఇక్కడా పెద్దగా ఆడలేదు. అయితే కార్తీక్ కూడా తాజాగా నాగార్జునకు స్టోరీ వినిపించారుట. ఇది ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ అని సమాచారం. నాగ్ కి నచ్చడంతో ఆయనా పాజిటివ్ గా స్పందించారుట. దీంతో నాగ్ సెంచరీ రేసులో కార్తీక్ పేరు ఎక్కవగా వినిపిస్తుంది. మరి వీరందర్నీ పిల్టర్ చేసి నాగ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.