పెళ్లికి పిలవలేదేమీ? ఆనంద్ మహీంద్రాకు చరణ్ ప్రశ్న!
చరణ్ తనను పెళ్లికి పిలవకపోవడం గురించి మహీంద్రాను ప్రశ్నించాడు.
By: Tupaki Desk | 24 March 2024 3:30 PM GMTమహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా తన ఫాలోవర్స్ ని యంగేజ్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. పారిశ్రామిక దిగ్గజం ఎన్నో విజ్ఞానదాయకమైన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా యువతరానికి చేరవేస్తున్నారు. ఇటీవల అతడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ఇంటరాక్షన్ లో ఆశ్చర్యపరిచాడు. చరణ్ తనను పెళ్లికి పిలవకపోవడం గురించి మహీంద్రాను ప్రశ్నించాడు.
ఆనంద్ మహీంద్రాను రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఇలా ప్రశ్నించారు. ``మీరు నన్ను సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు? నేను దగ్గర్లోనే ఉంటున్నాను. జహీరాబాద్‌కి చెందిన నా స్నేహితులను కలవడం సరదాగా ఉండేది`` అని అన్నారు. చరణ్ పోస్ట్ చేసిన వీడియోకి ప్రతిస్పందనగా మహీంద్రా ఇలా బదులిచ్చారు. ``నేను అంగీకరిస్తున్నాను. నేను గందరగోళానికి గురయ్యాను. మీకు ఆహ్వానం పంపడం మిస్సయ్యాను. నేను మీ చివరి పాఠం ఆధారంగా నా డ్యాన్స్ మూవ్స్ లో పర్ఫెక్షన్ కోసం ప్రయత్నంలో ఉన్నాను. ఇకపై అయినా గందరగోళానికి గురికాకుండా.. మళ్లీ మిస్ అవ్వకుండా ఉండనివ్వండి.. ముందుగానే మీకు (చరణ్ కు) పుట్టినరోజు (27 మార్చి) శుభాకాంక్షలు`` అని అన్నారు.
అంతకుముందు ఆనంద్ మహీంద్రా జహీరాబాద్‌లో అపరిష్కృతంగా ఉన్న తాగు నీటి సమస్యను హైలైట్ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఇక్కడ నీటి కొరత కారణంగా పురుషులు అవివాహితులుగా మిగిలిపోతున్నారు. సుజీత్ (ప్రకటనలో నటించాడు) లాంటి కుర్రాళ్లకు వధువుని ఇచ్చేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. ఈ సమస్య జహీరాబాద్‌కు మాత్రమే కాదు.. చాలా భారతీయ గ్రామాలు వివాహ పద్ధతులను గణనీయంగా ప్రభావితం చేసే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయితే జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్ భారతదేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడటమే కాకుండా రెయిన్ హార్వెస్టింగ్ ప్రయత్నాల ద్వారా జీవితాలను కూడా మారుస్తోంది. అక్కడ మహీంద్రా సంస్థ భారీగా మొక్కలు నాటడం ద్వారా భూగర్భంలో జలవనరులు పెరిగాయి. జహీరాబాద్ ప్రజలకు ఇప్పుడు పుష్కలంగా నీరు ఉంది. ఇది వారి జీవన నాణ్యతను మెరుగుపరుస్తోంది. అక్కడ కుర్రాళ్లకు వివాహ రేటు పెరుగుదలకు ఇది సహకరిస్తోంది.. అనే సారాంశంతో ఒక ప్రకటనను విడుదల చేసారు. ప్రకటనలో నటించిన సుజీత్ పెళ్లికి తనను పిలవలేదేమని చరణ్ సరదాగా అడిగారు.
రామ్ చరణ్ - ఆనంద్ మహీంద్రా ఇద్దరూ మంచి స్నేహానుబంధాన్ని కలిగి ఉన్నారు. RRR నుండి `నాటు నాటు` పాటకు ఆనంద్ మహీంద్రాకు చరణ్ ఐకానిక్ హుక్ స్టెప్ నేర్పించారు. ఆనంద్ మహీంద్రా దానికి తన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సరదా అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసారు. హైదరాబాద్ ఇ-ప్రిక్స్‌లో రామ్ చరణ్ మహీంద్రాజీకి స్టెప్పులు నేర్పించారు.