రాజమౌళిపై కోపం దేనికి?
సంక్రాంతి బరిలో విడుదలైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద 2 వారాల్లో 250 కోట్లు వసూలు చేయడం సంచలనం.
By: Tupaki Desk | 28 Jan 2024 7:21 PM GMTహనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా విజయం అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఒక్కో సినిమాతో ఇంతింతై ఎదిగిన ప్రశాంత్ తన కెరీర్‌ని చిన్న హీరోలతో ప్రారంభించి, చిన్న హీరోలతోనే ఎదుగుతున్నాడు కూడా. మధ్యలో రాజశేఖర్ తో `కల్కి` లాంటి ప్రయత్నం చేసాడు. జాంబిరెడ్డి లాంటి ప్రయోగాత్మక సినిమా తర్వాత మరోసారి తేజ సజ్జాతో హనుమాన్ లాంటి ప్రయోగం చేసాడు. ఈసారి కూడా బంపర్ హిట్ కొట్టాడు. సంక్రాంతి బరిలో విడుదలైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద 2 వారాల్లో 250 కోట్లు వసూలు చేయడం సంచలనం.
ఇక ఇదే హుషారులో హనుమంతుని కథతోనే హనుమాన్ సీక్వెల్ గా ``జై హనుమాన్` తెరకెక్కిస్తున్నానని ప్రకటించాడు. ఇప్పటికే స్క్రిప్టు రెడీ చేసుకుని ప్రీప్రొడక్షన్ ని కూడా ప్రారంభించిన ప్రశాంత్ వర్మ తాజా ఇంటర్వ్యూలో తన కంఫర్ట్ జోన్ గురించి ప్రస్థావించాడు. గతంలో పెద్ద హీరోల కోసం వేచి చూసి చాలా సమయం వృధా అయిందని, అందుకే తనకు సౌకర్యమైన హీరోలతోనే ముందుకు సాగుతున్నానని, ఇకపైనా ఇదే కొనసాగిస్తానని ప్రశాంత్ వర్మ అన్నారు. టామ్ క్రూజ్ అంత పెద్ద హీరో అవకాశమిచ్చినా కానీ, తనకు సౌకర్యంగా సినిమా పూర్తి చేయడం చాలా ముఖ్యమని కూడా అన్నాడు.
ఇక రాజమౌళి వద్ద అసిస్టెంట్ గా పని చేయాలని ప్రయత్నించి విఫలమయ్యానని ఆ విషయంలో కోపం వచ్చిందని కూడా అన్నాడు. రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని ఆయన టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఆయన మేకింగ్ స్టైల్ నాకెంతో ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించా. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడే ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించా. నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. టీమ్‌లో ఖాళీ లేదన్నారు. హార్డ్‌వర్క్, టాలెంట్ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం వచ్చింది. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. రాజమౌళి సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. అని అన్నారు.
అలాగే పెద్ద హీరోలతో పని చేయడానికి వ్యతిరేకం కాదని, వారితో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందని కూడా అన్నారు. పెద్ద హీరోల కోసం ఎదురుచూసి సమయాన్ని వృథా చేసుకున్న సందర్భాలున్నాయని ప్రశాంత్ వర్మ అన్నారు. ఇప్పుడు డెడ్ లైన్ పెట్టుకని పని చేస్తున్నా. నా అనేవాళ్లతో సిఇనమాలు చేస్తున్నను``’ అని ప్రశాంత్ వర్మ తెలిపారు.