అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారా?
ఏడాదిన్నరగా దాటినా ఇంతవరకూ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు.
By: Tupaki Desk | 5 Nov 2024 5:47 PM GMTఅక్కినేని హీరోల సినిమాలు థియేటర్లలోకి వచ్చి చాలా నెలలు గడిచిపోయింది. కింగ్ నాగార్జున ఈ ఏడాది సంక్రాంతికి 'నా సామి రంగా' చిత్రంతో వచ్చి హిట్టు కొట్టాడు కానీ, ఆ తర్వాత ఆయన్నుంచి మరో మూవీ రాలేదు. నాగచైతన్య, అఖిల్ లు చివరగా లాస్ట్ ఇయర్ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఏడాదిన్నరగా దాటినా ఇంతవరకూ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే 2025లో అక్కినేని హీరోల సినిమాలు వస్తుండటంతో, ఇది వాళ్లకు మరపురాని సంవత్సరంగా మిగిలిపోతుందని నమ్ముతున్నారు.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 'తండేల్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న సినిమా. చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో చై మునుపెన్నడూ చూడని విధంగా.. తొలిసారిగా డీ గ్లామర్ గా, రస్టిక్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని నిర్మాత బన్నీ వాసు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
టాలీవుడ్ లో అక్కినేని హీరోలు ఇంకా 100 కోట్ల మార్క్ ను క్రాస్ చెయ్యలేదు. దగ్గర దగ్గరగా వచ్చి ఆగిపోతున్నారు. ఎన్ని హిట్లు కొడుతున్నా ఆ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే 'తండేల్' సినిమాతో నాగచైతన్య ఆ ఫీట్ అందుకుంటాడని బన్నీ వాసు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చూసి అభిమానులంతా కాలర్ ఎగరేస్తారని నమ్మకంగా చెబుతున్నారు. దీని కోసం షర్ట్ కొనుక్కొని కాలర్ ఐరన్ చేసి పెట్టుకోమని అంటున్నారు. అంత మంచి సినిమాతో రాబోతున్నామని పేర్కొన్నారు. చైతూకి నేషనల్ అవార్డు కూడా రావాలని ఆశిస్తున్నారు.
మరోవైపు యూత్ కింగ్ అఖిల్ అక్కినేని 'ఏజెంట్' సినిమా ప్లాప్ తర్వాత పూర్తిగా ఆఫ్ లైన్ లోకి వెళ్ళిపోయారు. రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడని అంటున్నారు కానీ, ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే కొత్త ఏడాదిలో ఈ సినిమాలకు సంబంధించిన అనౌన్స్ మెట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ లో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాలు ఉంటాయని అంటున్నారు. అంతేకాదు వాటిల్లో ఒక చిత్రాన్ని 2025 చివర్లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
నాగార్జున సైతం వచ్చే ఏడాది రెండు మూడు సినిమాలతో అభిమానులను పలకరించబోతున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'కుబేర' చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరిలో విడుదల చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకే నెలలో నాగచైతన్య వచ్చిన రెండు వారాలకు థియేటర్లలోకి రావొచ్చని అంటున్నారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించే టీజర్ లాంచ్ లో రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని భావించవచ్చు.
లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో నాగ్ కీలక పాత్ర పోషిస్తున్న 'కూలీ' సినిమా కూడా వచ్చే సంవత్సరం రానుంది. ఇందులో నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. రెండు షెడ్యూల్స్ షూట్ మాత్రమే పెండింగ్ ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే కుబేర, కూలీ సినిమాలలో నాగ్ మెయిన్ హీరో కానప్పటికీ, ఆయనకు మంచి పేరు తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఇయర్ నాగ్ హీరోగా ఓ సినిమాకి అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.
ఇలా వచ్చే ఏడాది ముగ్గురు అక్కినేని హీరోల నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి. కొన్ని అనౌన్స్ మెంట్లు ఉండబోతున్నాయి. కాబట్టి 2025 తండ్రీ కొడుకులకు మెమొరబుల్ ఇయర్ గా మిగిలిపోతుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఇదే జరిగితే వాళ్ళంతా కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఉంటుంది. మరి ఫ్యాన్స్ ఆశించిన విధంగానే వచ్చే ఏడాది వాళ్ళ కెరీర్ సాగుతుందేమో చూడాలి.