డాకు మహారాజ్ కోసం పుష్పరాజ్..?
మళ్ళీ ఇప్పుడు బాలయ్య కోసం అతిథిగా రాబోతున్నారని అంటున్నారు. 'డాకు మహారాజ్ కోసం పుష్పరాజ్' వస్తాడనే వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.
By: Tupaki Desk | 28 Dec 2024 6:56 AM GMTనటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''డాకు మహారాజ్''. బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ భారీ మాస్ యాక్షన్ సినిమా తెరకెక్కుతోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు కాంబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. దర్శక నిర్మాతలు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్టార్ హీరో అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వస్తారని టాక్ వినిపిస్తోంది.
'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఎప్పుడనేది కచ్చితంగా తెలియదు కానీ, ఈ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. గతంలో 'అఖండ' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి బన్నీ గెస్టుగా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు బాలయ్య కోసం అతిథిగా రాబోతున్నారని అంటున్నారు. 'డాకు మహారాజ్ కోసం పుష్పరాజ్' వస్తాడనే వార్తల్లో నిజమెంతనేది తెలియాల్సి ఉంది.
ఎందుకంటే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ పెద్దగా బయటకు రావడం లేదు. 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో సందర్భంగా దురదృష్టవశాత్తూ ఓ మహిళ చనిపోవడం, దీని కారణంగా బన్నీ మీద కేసు నమోదు చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. ఇప్పటికే 'పుష్ప 2' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్లాన్ చేసుకున్న ఈవెంట్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పబ్లిక్ ఈవెంట్ కు బన్నీ గెస్టుగా వస్తారా లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. 'డాకు మహారాజ్' మేకర్స్ త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఇకపోతే 'డాకు మహారాజ్' చిత్రంలో బాలకృష్ణ ఇంతకముందెన్నడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'యానిమల్' ఫేమ్, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ స్టైలిష్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. చాందినీ చౌదరి, సచిన్ కేడ్కర్, రిషి, హర్ష వర్ధన్, హిమజ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, డాకు టైటిల్ సాంగ్, చిన్ని పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 2న ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్.
'డాకు మహారాజ్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఎస్.థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా, నిరంజన్ దేవరమానే ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో బాలకృష్ణ ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. మరోవైపు దర్శకుడు 'వాల్తేరు వీరయ్య' మూవీతో హిట్టు కొట్టి ఉన్నారు. మరి ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న "డాకు మహారాజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.