'బన్నీ Vs రాజమౌళి' కాదు.. 'బన్నీ & రాజమౌళి'
దీంతో బన్నీకి రాజమౌళి రికార్డులను అందుకునే సత్తా ఉందనే చర్చలు నెట్టింట మొదలయ్యాయి.
By: Tupaki Desk | 22 Oct 2024 4:34 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''పుష్ప 2: ది రూల్''. ఇది బ్లాక్ బస్టర్ 'పుష్ప: ది రైజ్' కు కొనసాగింపుగా రాబోతోంది. దీని కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రేజీ సీక్వెల్ పై ట్రేడ్ లో అంచనాలు మాములుగా లేవు. ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 1000 కోట్లకు పైగా బిజినెస్ తో ఆల్ టైం రికార్డ్ సృష్టించినట్లుగా చెబుతున్నారు. దీంతో బన్నీకి రాజమౌళి రికార్డులను అందుకునే సత్తా ఉందనే చర్చలు నెట్టింట మొదలయ్యాయి.
ఇండియన్ సినిమాలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎస్.ఎస్ రాజమౌళి రికార్డులకు దగ్గరగా వెళ్లాలని ట్రై చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద నాన్- ఎస్ఎస్ఆర్ రికార్డులు పెడుతున్నారు. అంతేకానీ జక్కన్న రికార్డులను క్రాస్ చెయ్యాలనే సాహసం ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఆయన నెలకొల్పిన రికార్డులు అలాంటివి. ఏడేళ్ల క్రితం 'బాహుబలి 2'తో క్రియేట్ చేసిన హయ్యెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉంది. RRR చిత్రంతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసారు. అయితే ఇప్పుడు 'పుష్ప 2' ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లకు పైగానే జరిగిందనే వార్తలు వస్తుండటంతో, కొందరు అభిమానులు రాజమౌళి సినిమాలతో కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బన్నీ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్.. రాజమౌళి థియేట్రికల్ వాల్యుయేషన్ కంటే ఎక్కువ ఉందని కామెంట్స్ చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 480 కోట్ల వరకూ అమ్ముడయ్యాయి. డిజిటల్, శాటిలైట్, ఆడియో వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ తో కలిసి దాదాపు రూ. 900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న లెక్కల ప్రకారం, రూ.1065 కోట్లతో 'పుష్ప 2' ప్రీరిలీజ్ బిజినెస్ RRR గణాంకాలను క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి రికార్డులను అల్లు అర్జున్ అధిగమించారని, ఇంతకు ముందు ఏ స్టార్ హీరోకి ఇది సాధ్యం కాలేదని ఓవర్గం సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ వారంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఇండియన్ సినిమాలో వెయ్యి కోట్ల మార్కెట్ ను ఓపెన్ చేసిందే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. 'బాహుబలి 2' చిత్రంతో 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. అప్పటి నుంచే '1000 కోట్ల క్లబ్' అనేది మైలురాయి మార్క్ గా మారిపోయింది. ఇప్పుడు అందరూ వెయ్యి కోట్ల మార్కెట్ అంటున్నారంటే, దానికి మొదట బాటలు వేసింది మాత్రం జక్కన్నే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలకు పాన్ ఇండియా స్టార్ డమ్ రావడానికి కారణం కూడా ఆయనే. ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటున్నారంటే, ఆ ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం నిస్సందేహంగా రాజమౌళినే.
అయితే ఇక్కడ అల్లు అర్జున్ ను తక్కువ చేయడానికి ఏం లేదు. రాజమౌళి సపోర్ట్ లేకుండానే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో అతను. 'పుష్ప 1' సినిమాతో నార్త్ బెల్ట్ లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు 'పుష్ప 2'తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి రాజమౌళి లేకుండానే భారీ పాన్ ఇండియన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న బన్నీ ప్రయత్నాలను కచ్చితంగా అందరూ మెచ్చుకొని తీరాలి. ఒకవేళ నిజంగానే ఈ సినిమా 1000 కోట్ల బిజినెస్ చేసుంటే, అది తెలుగు సినిమాకే గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 'అల్లు అర్జున్ Vs రాజమౌళి' అని కాకుండా.. 'అల్లు అర్జున్ & రాజమౌళి' అని పేర్కొనడం గౌరవంగా ఉంటుందని చెప్పాలి.