నాని కొంచెం మునిగాడు.. మరి తారక్?
ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలకు నగరాలు ఎలా జలమయం అవుతున్నాయో తెలిసిందే.
By: Tupaki Desk | 24 Sep 2024 4:24 AM GMTభారీ వర్షాలు పడుతున్నపుడు సినిమాల వసూళ్లపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలకు నగరాలు ఎలా జలమయం అవుతున్నాయో తెలిసిందే. అలాంటి టైంలో బయటికి రావడమే చాలా ప్రమాదం. వర్షంలో తడుస్తూ, ఇబ్బంది పడుతూ మరీ థియేటర్లకు వెళ్లాలని ప్రేక్షకులు అనుకోరు. స్టార్ హీరోల సినిమాలైతే, టికెట్లు ముందే బుక్ చేసుకున్నట్లయితే థియేటర్లకు వస్తారు కానీ.. లేదంటే సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎదురు చూస్తారు. గత నెలలో వర్షాలకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలాఖర్లో వచ్చిన నేచురల్ స్టార్ నాని సినిమా ‘సరిపోదా శనివారం’ వసూళ్లపై గట్టి ప్రభావమే పడింది. ఈ సినిమాకు కీలకమైన వీకెండ్లోనే వర్షాలు ముంచెత్తడంతో కలెక్షన్లు తగ్గాయి. విజయవాడలో అయితే ఆ సినిమా నామమాత్రంగా ఆడింది. వేరే చోట్ల కూడా వసూళ్లపై ప్రభావం పడింది.
ఐతే వరుణుడి విజృంభణ అంతటితో అయిపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఈ నెలాఖర్లో తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు పడబోతున్నట్లు చెబుతున్నారు. ఈసారి తెలంగాణలోనే ఎక్కువ ప్రభావం ఉంటుందట. ఆల్రెడీ గత రెండు రోజులు సాయంత్రం, రాత్రి పూట వర్షాలు గట్టిగా పడడ్డాయి. ‘దేవర’ రిలీజ్ టైంకి ఇంకా ఎక్కువ వర్షాలు పడొచ్చని అంటున్నారు. ఇది ‘దేవర’ నిర్మాతలు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు ఆందోళన కలిగించే విషయమే. తారక్ సినిమా అంటే అభిమానులు ఎంత వర్షం పడ్డా లెక్క చేయరు కానీ.. సామాన్య ప్రేక్షకులు మాత్రం కొంచెం ఆలోచిస్తారు. వర్షం ఓ మోస్తరు స్థాయిలో ఉంటే ఇబ్బంది లేదు కానీ.. ‘సరిపోదా శనివారం’ టైంలో మాదిరి మరీ విజృంభించకుంటే చాలని ఆశిస్తున్నారు. మరి తారక్ సినిమా మీద వరుణుడు ఏమేర ప్రభావం చూపుతాడో చూాడాలి.