Begin typing your search above and press return to search.

అప్పుడు మైత్రీ, ఇప్పుడు ఎస్వీసీ.. దిల్ రాజుకు అతి పెద్ద ఛాలెంజ్ ఇదే!

అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మూడు సినిమాలతోనూ నిర్మాత దిల్ రాజు సంబంధం కలిగి ఉన్నారు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 8:30 PM GMT
అప్పుడు మైత్రీ, ఇప్పుడు ఎస్వీసీ.. దిల్ రాజుకు అతి పెద్ద ఛాలెంజ్ ఇదే!
X

2025 సంక్రాంతి సినిమాల మీద ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ 'NBK109' చిత్రాలు ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్టుగా వెంకటేశ్ నటిస్తున్న 'సంక్రాంతి వస్తున్నాం' సినిమాని కూడా పెద్ద పండుగకే తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మూడు సినిమాలతోనూ నిర్మాత దిల్ రాజు సంబంధం కలిగి ఉన్నారు.

శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఇది శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందే 50వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని కోసం 'విశ్వంభర' సినిమాని వాయిదా వేయించి, జనవరి 10వ తేదీని లాక్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో సంక్రాంతికి రిలీజ్ అయ్యే బాలయ్య మూవీకి దిల్ రాజు మేజర్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. తన నిర్మాణంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తీస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాన్ని కూడా ఫెస్టివల్ రేసులోకి తీసుకొస్తున్నారు.

ఒక ప్రొడక్షన్ హౌస్ లో రూపొందిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం, బాక్సాఫీస్ వద్ద ఒకదానితో ఒకటి పోటీ పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. టాలీవుడ్ ఇలాంటి పరిస్థితి రెండోసారి రిపీట్ అవుతుంది. 2023 సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహారెడ్డి' సినిమాలు ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఇప్పుడు దిల్ రాజు కూడా అలాంటి ఫీట్ సాధిస్తారా లేదా? అనే చర్చలు మొదలయ్యాయి.

రెండు పెద్ద సినిమాలను ఒకేసారి విడుదల చేయాలనుకున్నప్పుడు, సరిపడా థియేటర్లను కేటాయించాల్సి ఉంటుంది. అందులోనూ హీరోల అభిమానులను సంతృప్తి పరిచేలా ప్రమోషన్స్ చేయాల్సి ఉంటుంది.. రెండిటికీ మంచి రిలీజ్ ప్లాన్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ వైరం ఉన్న చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు సీనియర్ హీరోల చిత్రాలను సక్సెస్ ఫుల్ గా విడుదల చేయగలిగారు.. హిట్టు కొట్టారు. ఇప్పుడు దిల్ రాజుకు కూడా ఇదే అతి పెద్ద ఛాలెంజ్ గా మారబోతోంది.

దిల్ రాజు తన బ్యానర్ లోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అయిన 'గేమ్ ఛేంజర్' కి ఎక్కువ ధియేటర్లు కేటాయించాలి. నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు కాబట్టి, బాలయ్య-బాబీల సినిమాకి తగినన్ని స్క్రీన్లు ఇవ్వాలి. అదే సమయంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి కూడా అధిక సంఖ్యలో థియేటర్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెంకీ - అనిల్ రావిపూడిలది హిట్ కాంబినేషన్. గతంలో వీరికి 'ఎఫ్ 2' 'ఎఫ్ 3' వంటి హిట్లు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమా కనుక, అందుకు తగ్గట్టుగానే థియేటర్లు అలాట్ చెయ్యాల్సిన అవసరముంది.

సందీప్ కిషన్ 'మజాకా' మూవీతో పాటుగా మైత్రీ మేకర్స్ వారి తమిళ్ డబ్బింగ్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా సంక్రాంతికి వస్తాయని అంటున్నారు. అదే జరిగితే వాటికి కొన్ని థియేటర్లు పోతాయి. కాబట్టి దిల్ రాజు ముందుగా థియేటర్ల సమస్యను పరిష్కరించుకోవాలి. ఆ తర్వాత అటు మెగా ఫ్యాన్స్ ను, ఇటు దగ్గుబాటి అభిమానులను సంతృప్తి పరిచేలా ప్రమోషనల్ కంటెంట్ వదలాలి. రెండు సినిమాలను జనాలకు చేరువ చెయ్యడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. అప్పుడే ఒకే బ్యానర్‌లో రెండు చిత్రాలను సంక్రాంతికి విడుదల చేసి, రెండు విజయాలు సాధించిన నిర్మాతగా మైత్రీ రికార్డ్‌ను సమం చేసే అవకాశం ఉంటుంది. చూద్దాం.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో!