తలైవాపైనే ఆశలు పెట్టుకున్న తమిళ తంబీలు!
హిందీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే 1000 కోట్ల క్లబ్ ను క్రాస్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో.
By: Tupaki Desk | 17 Dec 2024 3:15 AM GMTఇండియన్ సినిమాలో ఎక్కువ చిత్రాలను రూపొందించే ఫిలిం ఇండస్ట్రీలలో 'కోలీవుడ్' ఒకటి. ఓవైపు మాస్ మసాలా మూవీస్, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రశంసలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో తమిళ చిత్రాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. పాన్ ఇండియాకు కీలకమైన హిందీ బెల్ట్ లో మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోతున్నాయి. అందుకే టాలీవుడ్ కంటే వెనకబడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పుడు ఇండియా సినిమాలో టాలీవుడ్ డానినేషన్ కొనసాగుతోంది. తెలుగు నుంచి ఓ పెద్ద సినిమా వస్తుందంటే 1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందనే చర్చలు జరగడం కామన్ అయిపోయింది. ఇప్పటి వరకూ 8 చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరితే, వాటిల్లో నాలుగు తెలుగు సినిమాలే ఉన్నాయి. అదే సమయంలో తమిళం నుంచి ఒక్కటంటే ఒక్క మూవీ కూడా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చేస్తున్నా.. వెయ్యి కోట్ల మైలురాయిను అందుకోలేకపోతున్నాయి.
తమిళ చిత్ర పరిశ్రమకు 100 కోట్ల నుంచి 800 కోట్ల క్లబ్ వరకూ పరిచయం చేసింది సూపర్ స్టార్ రజనీకాంత్ అనే సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'శివాజీ' సినిమా 100 కోట్లు వసూలు చేస్తే.. 'రోబో' మూవీ 200, 300 కోట్ల క్లబ్ లో చేసిన మొట్ట మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. ఇక 'రోబో 2.0' సినిమా 400, 500, 600, 700, 800 కోట్ల మార్క్ ను టచ్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ కు అందని ద్రాక్షలా మారిన ₹1000 కోట్ల డ్రీమ్ ను కూడా తలైవానే నెరవేరుస్తాడని తమిళ తంబీలు భావిస్తున్నారు. 'కూలీ' కచ్ఛితంగా మైల్ స్టోన్ క్లబ్ లో చేరుతుందని ధీమాగా ఉన్నారు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "కూలీ". ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ హీరో ఉపేంద్ర, మలయాళ నటుడు సౌభిన్ సాహిర్, సౌత్ హీరోయిన్ శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. స్టార్ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ జనాలకు నచ్చితే, రూ. 1000 కోట్ల వసూళ్లు సాధ్యమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
రజనీకాంత్ నటించిన 2.0 మూవీ 800 కోట్లకి పైగా వసూళ్లు సాధించగా.. 'జైలర్' సినిమా 650 కోట్ల వరకూ రాబట్టింది. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన 'లియో' మూవీ టాక్ తో సంబంధం లేకుండా 620 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు 'కూలీ' చిత్రంలో వీరిద్దరితో పాటుగా కింగ్ నాగార్జున కూడా తోడయ్యారు కాబట్టి, 'విక్రమ్' రేంజ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల లెక్క 100 కోట్లతో ప్రారంభం అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. హిందీ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే 1000 కోట్ల క్లబ్ ను క్రాస్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో.