Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో తారక్.. ఎవరైతే బాగుంటుంది?

పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన దేవర కోసం ప్రమోషన్స్ తో పాటు అన్ని విషయాల్లో తారక్ చాలా కష్టపడ్డారు.

By:  Tupaki Desk   |   4 Oct 2024 5:30 PM GMT
కోలీవుడ్ లో తారక్.. ఎవరైతే బాగుంటుంది?
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో చేసిన దేవర పార్ట్-1 మంచి హిట్ అవ్వడంతో ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా కొందరు సినీ ప్రముఖులతో పార్టీ కూడా జరుపుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన దేవర కోసం ప్రమోషన్స్ తో పాటు అన్ని విషయాల్లో తారక్ చాలా కష్టపడ్డారు. అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అందుకుని ఇప్పుడు ఖుషీగా గడుపుతున్నారు.

అదే సమయంలో తారక్ కొత్త చిత్రాలపై అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన చేతిలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు వార్-2 ఉంది. త్వరలో ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన మూవీ షూటింగ్ స్టార్ట్ కానుండగా.. వార్-2కు గాను ఇప్పటికే తన పార్ట్ ను తారక్ కంప్లీట్ చేశారని తెలుస్తోంది. దేవర సీక్వెల్ చేయాల్సి ఉన్నా.. అది సెట్స్ పైకి వెళ్లడానికి టైం పడుతుంది. అంతకుముందు ఓ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో తారక్ వర్క్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన దేవర ప్రెస్ మీట్ లో.. దర్శకుడు వెట్రిమారన్ తో డైరెక్ట్ తమిళ మూవీ చేయాలనుందని ఎన్టీఆర్ చెప్పారు. దాన్ని తెలుగులోకి డబ్ చేయాలని అన్నారు. వెట్రిమారన్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. దీంతో వారి కాంబోలో మూవీ కచ్చితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే రజినీకాంత్ జైలర్-2తో ఫుల్ బిజీగా ఉన్న తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. తారక్ కు రీసెంట్ గా స్టోరీ నెరేట్ చేశారని వార్తలు వస్తున్నాయి.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. తారక్ కు వెట్రిమారన్, నెల్సన్ లో ఎవరు కరెక్ట్ గా సెట్ అవుతారని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే వెట్రిమారన్ సినిమాలు.. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటాయి. అణచివేతకు సంబంధించిన కథల చుట్టూ తిరుగుతుంటాయి. తారక్ తెలుగు ఫ్యాన్స్ కు అలాంటి చిత్రాలు పెద్దగా నచ్చకపోవచ్చని, పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఆకట్టుకోలేకపోవచ్చని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.

అదే సమయంలో నెల్సన్ ఎన్టీఆర్‌ కు బెస్ట్ చాయిస్ అని మరికొందరు చెబుతున్నారు. యాక్షన్, కామెడీ, డ్రామా అన్నీ కలగలిపి నెల్సన్ సినిమాలు తీస్తారని.. కమర్షియల్ గా కూడా వర్కౌట్ అవుతాయని అంటున్నారు. కాబట్టి తారక్ తో నెల్సన్ మంచి మాస్ మూవీ తీస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇద్దరిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నా.. బాక్సాఫీస్ పరిస్థితి బట్టి చూస్తే నెల్సన్ బెటర్ అంటున్నారు. మరి.. తారక్ ఫ్యూచర్ లో ఎవరితో వర్క్ చేస్తారో చూడాలి!!