Begin typing your search above and press return to search.

ప్రభాస్‏కు సాధ్యం కానిది, బన్నీతో అవుతుందా?

అందుకే మన దర్శక నిర్మాతలు డిసెంబర్ లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:09 PM GMT
ప్రభాస్‏కు సాధ్యం కానిది, బన్నీతో అవుతుందా?
X

సాధారణంగా డిసెంబర్ నెలను సినిమాలకు మంచి సీజన్ గా భావిస్తుంటారు మన ఫిలిం మేకర్స్. చలికాలం, పైగా క్రిస్మస్ హాలిడేస్ కూడా ఉండటంతో సినీ ప్రియులు థియేటర్లకు తరలి వస్తుంటారు. అందుకే మన దర్శక నిర్మాతలు డిసెంబర్ లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఒకప్పుడు సీనియర్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున ప్రతీ ఏడాది తప్పకుండా క్రిస్మస్ సీజన్ లో వచ్చి, ఒక హిట్టు కొట్టేవారు. కొన్నేళ్లపాటు అది ఆయనకు సెంటిమెంట్ గా నడిచింది.

కోవిడ్ పాండమిక్ తర్వాత 'పుష్ప: ది రైజ్', 'కేజీయఫ్ చాప్టర్ 1', 'యానిమల్' 'సలార్' వంటి పాన్ ఇండియా సినిమాలు డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యాయి.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించాయి. 'అఖండ', 'ధమాకా', 'హిట్ 2: ది సెకండ్ కేస్', 'శ్యామ్ సింగరాయ్' లాంటి కొన్ని తెలుగు చిత్రాలు కూడా ఇదే నెలలో వచ్చి సక్సెస్ సాధించాయి. ఇతర భాషల్లోనూ అనేక చిత్రాలు విజయం సాధించాయి. ఇప్పుడు ''పుష్ప 2'' మూవీ సైతం డిసెంబర్ లో వస్తుంది కాబట్టి, కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''పుష్ప 2: ది రూల్''. ఇది 'పుష్ప: ది రైజ్' మూవీకి సీక్వెల్. ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత సెంటిమెంట్ గా డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. చివరకు ఒక్కరోజు ముందుగా, అంటే డిసెంబర్ 5న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు.

ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది కానీ, ఇప్పటి వరకూ డిసెంబర్ నెలలో రిలీజైన ఏ ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ మార్క్ టచ్ చేయలేదు. ఈ నెలను మంచి సీజన్ గా భావించినప్పటికీ, ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో 'బాహుబలి 2', 'దంగల్‌', KGF 2, RRR, 'పఠాన్‌', 'జవాన్‌', 'కల్కి 2898 AD' వంటి 7 చిత్రాలు ఈ ప్రతిష్టాత్మక క్లబ్ లో చేరాయి. వీటిల్లో డిసెంబర్ లో విడుదలైన మూవీ ఒకటి కూడా లేదు.

గతేడాది డిసెంబర్ లో వచ్చిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమా ఈ మైలురాయి మార్కుకు చాలా దగ్గరగా వచ్చింది కానీ, ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల గ్రాస్ తో తన పరుగును ముగించింది. కచ్చితంగా 1000 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అంచనా వేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌' చిత్రం.. రూ.750 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు ''పుష్ప 2'' చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది రూ. 1000 కోట్ల గ్రాసర్‌గా నిలిచిన మొట్ట మొదటి డిసెంబర్ సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

'పుష్ప 2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రూ.1000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందనే వార్తలు ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారాయి. ఇటీవల కాలంలో '1000 కోట్ల క్లబ్'ను మైల్ స్టోన్ మార్క్ గా భావిస్తున్నారు కాబట్టి, కచ్చితంగా అల్లు అర్జున్ ఆ ఫీట్ ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా చుట్టూ నెలకొన్న బజ్, క్రేజ్ ను చూస్తే.. 'యానిమల్'ను క్రాస్ చేసి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఏమంత కష్టం కాదు అనే మాట వినిపిస్తోంది. మరి డిసెంబర్ సెంటిమెంట్ ను బన్నీ బ్రేక్ చేస్తాడా? బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుంది? అనేది వేచి చూడాలి.