రామ్ చరణ్ దర్గా వివాదం.. అయ్యప్ప జేఏసీ సీరియస్!
టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించడం కొన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 21 Nov 2024 5:18 AM GMTటాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాను సందర్శించడం కొన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయ్యప్ప మాలను ధరించి ఉన్న చరణ్ ఇస్లాం మతానికి సంబంధించిన పవిత్ర స్థలమైన దర్గాను సందర్శించడంపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.
కొంతమంది ఈ ఘటనను మత సామరస్యానికి చిహ్నంగా చూస్తుండగా, మరికొందరు అయ్యప్ప మాల ధారణలో ఉన్నప్పుడు దర్గాను సందర్శించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లడం వెనుక కారణం ఏఆర్ రెహమాన్ కు ఇచ్చిన మాట అని క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తిచేసుకుని, అప్పటివరకు అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్, రెహమాన్ ఆహ్వానం మేరకు దర్గాను సందర్శించినట్లు చెప్పారు.
కానీ, ఈ చర్యపై తెలంగాణ అయ్యప్ప జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “పవిత్రమైన అయ్యప్ప మాలలో ఉంటూ దర్గాను సందర్శించడం అనవసరం. ఇది సనాతన ధర్మాన్ని అవమానించడమే,” అని జేఏసీ ఆరోపించింది. అయితే, రామ్ చరణ్ ఈ ఘటనపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో, అయ్యప్ప జేఏసీ బహిరంగ క్షమాపణలు కోరుతూ ప్రకటన చేసింది.
“రెహమాన్ రామ్ చరణ్‌ను దర్గాకు తీసుకువెళ్లి కుట్రపూరితంగా ఈ వివాదాన్ని సృష్టించారు. చరణ్ శబరిమలకు వెళ్ళినట్లుగా రెహమాన్‌ను తిరుపతికి తీసుకెళ్లగలరా?” అంటూ జేఏసీ ప్రతినిధులు ప్రశ్నించారు.
'ఒకపక్క పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే ఇంకోపక్క వాళ్ల అబ్బాయి అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్ళాడు. ఈ అంశంపై రామ్ చరణ్ వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలి, క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
అయితే ఇటీవల ఉపాసన ఈ వివాదంపై తనదైన శైలిలో ఒక వివరణ ఇచ్చారు. మన దేశంలో ఈ విధంగా ఒకరి మతాలను మరొకరు గౌరవించడం చాలా మంచిదని అన్నారు. అంతే కాకుండా శబరిమలకు వెళ్లే భక్తులు మసీదులో ప్రార్థనలు చేసే సంప్రదాయం గురించి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన కథనాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విధానంతో మనం అందరం ఒక్కటే అనే స్ఫూర్తిని నింపాలి అని ఆమె ఒక వివరణ ఇచ్చారు.
అయితే రామ్ చరణ్ దర్గాకు వెళ్లిన విధానంపై పలువురు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేస్తున్నారు. ఈ వ్యవహారం సినీ పరిశ్రమతో పాటు సామాజిక వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీసింది. రామ్ చరణ్ త్వరలోనే ఈ విషయంపై స్పందిస్తారని అభిమానులు ఆశిస్తున్నా, ప్రస్తుతం ఈ ఘటన నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి. మరోవైపు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ చేంజర్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.