అమ్మడు ఈసారి హిట్టు కొట్టకపోతే కష్టమేనా?
ఇప్పుడు రుక్మిణి వసంత్ కి రెండు పెద్ద పరాజయాలు రావడంతో, తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By: Tupaki Desk | 11 Nov 2024 10:30 PM GMT'సప్త సాగరాలు దాటి' అనే కన్నడ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుక్మిణి వసంత్. 'సైడ్ A' & 'సైడ్ B' గా గతేడాది వచ్చిన ఈ సినిమాలు, థియేటర్లలో పెద్దగా ఆడలేదు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తన అందం, నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆమె క్యూట్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు యువ హృదయాలను ఆకర్షించాయి. దీంతో ఈ బ్యూటీ వీలైనంత త్వరగా టాలీవుడ్ లో అడుగుపెడుతుందని అందరూ భావించారు. భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకుంటుందని అనుకున్నారు. రుక్మిణిని హీరోయిన్ గా తీసుకోవాలని సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థలను ట్యాగ్ చేస్తూ పోస్టులు కూడా పెట్టారు.
నిజానికి రుక్మిణి వసంత్ రెండేళ్ల క్రితమే తెలుగులో ఓ ప్రాజెక్ట్ కి సైన్ చేసింది. నిఖిల్ సిద్దార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించే సినిమా ఇది. సైలెంట్ గా షూటింగ్ జరుపుకోవడంతో ఈ సినిమా గురించి జనాలకు తెలియలేదు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే తెలుగు తెరకు ఈ సినిమాతోనే పరిచయమయ్యేది. కానీ అలా జరగలేదు. ఈలోగా 'సప్త సాగరాలు దాటి' డబ్బింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.. ఆమెను క్రేజీ హీరోయిన్ గా మార్చేసింది. ఇంతలోనే తెలుగులో భారీ పరాజయం పలకరించింది.
అప్పుడు హోల్డ్ లో పడిన నిఖిల్ సినిమా.. దురదృష్టవశాత్తు ఇప్పుడు 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' పేరుతో రుక్మిణిని వెంటాడింది. ఓటీటీ డీల్స్ కారణంగా మేకర్స్ ఉన్నట్టుండి ఈ చిత్రాన్ని గత శుక్రవారం థియేటర్లలో రిలీజ్ చేసారు. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా విడుదలైన ఈ సినిమాకి, ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక, బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో హీరో నిఖిల్ తో పాటుగా రుక్మిణి ఖాతాలో ఒక భారీ ప్లాప్ చేరినట్లయింది.
దీపావళి సందర్భంగా 'బఘీర' అనే కన్నడ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది రుక్మిణి వసంత్. ప్రశాంత్ నీల్ కథతో రూపొందిన ఈ చిత్రం.. తెలుగులో ఏమాత్రం ఆకట్టుకోలేదు. దీంతో ఫస్ట్ వీకెండ్ లోనే ఎలాంటి సౌండ్ లేకుండా థియేటర్లలో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో రిలీజైన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా సైతం అమ్మడికి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇలా వరుసగా రెండు ప్లాపులు పడటం అనేది ఏ హీరోయిన్ కెరీర్ కైనా ఎదురుదెబ్బే.
సినీ ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ అయినా సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో విజయం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ హిట్లు వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది కానీ, ప్లాప్స్ పడితేనే కష్టం. ఇప్పుడు రుక్మిణి వసంత్ కి రెండు పెద్ద పరాజయాలు రావడంతో, తెలుగులో ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే అమ్మడు అర్జెంట్ గా హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి ప్రస్తుతం ఆమె నటిస్తున్న శివరాజ్ కుమార్ 'భైరతి రణగల్', విజయ్ సేతుపతి 'ఏస్', శివ కార్తికేయన్ సినిమాలు ఎలాంటి విజయాలు అందిస్తాయో వేచి చూడాలి.