Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ క్ష‌మాప‌ణ చెబితేనే బెదిరింపులు త‌గ్గుతాయి

స‌ల్మాన్ ఖాన్ కృష్ణ జింక‌ను చంపినందుకు త‌మ స‌మాజానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 11:30 PM GMT
స‌ల్మాన్ క్ష‌మాప‌ణ చెబితేనే బెదిరింపులు త‌గ్గుతాయి
X

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ వ‌ర్సెస్ స‌ల్మాన్ ఖాన్ ఎపిసోడ్స్ అంత‌కంత‌కు ముదిరిపాక‌న ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. అత‌డికి బిష్ణోయ్ కమ్యూనిటీ అంతా అండ‌గా నిలుస్తుండ‌డంతో అత‌డి ఆగ‌డాల‌కు హ‌ద్దు అన్న‌దే లేకుండా పోయింది. జైలులో ఉన్న అత‌డికి త‌మ తెగ మ‌ద్ధ‌తు ప‌లుకుతోంద‌ని ప‌లువురు బిష్ణోయ్ క‌మ్యూనిటీ నాయ‌కులు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ కృష్ణ జింక‌ను చంపినందుకు త‌మ స‌మాజానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా బిష్ణోయ్ తెగ రైతు నాయ‌కుడి నుంచి స‌ల్మాన్ కి ఒక సూచ‌న అందింది. లారెన్స్ బిష్ణోయ్ నుండి బెదిరింపులు పెరగకుండా ఉండాలంటే.. కృష్ణజింకలను వేటాడిన కేసులో బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని రైతు నాయకుడు రాకేష్ టికైత్ సల్మాన్ ఖాన్‌ను కోరారు. బహిరంగ క్షమాపణలు బిష్ణోయ్ స‌మాజానికి ప్రయోజనం చేకూరుస్తాయ‌ని, ఉద్రిక్తతలను తగ్గించగలవ‌ని.. బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ఖాన్ భద్రతకు భరోసానిస్తుందని టికైట్ నొక్కి చెప్పారు. దీనికి బిష్ణోయ్ ముఠా బాధ్యత వహిస్తుందని అన్నారు.

సల్మాన్‌పై బహిరంగంగా శత్రుత్వాన్ని ప్రకటించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుండి బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సలహా ఆస‌క్తిక‌రంగా మారింది. రైతు సంఘం తరపున రాకేష్ టికైత్ సయోధ్య అవసరాన్ని నొక్కి చెబుతూ రంగంలోకి దిగారు. ఆయ‌న వ్యాఖ్య‌ల సారాంశం ఇలా ఉంది.

``చూడండి, ఇది సమాజానికి సంబంధించిన విషయం.. సమాజానికి అనుసంధానించబడి ఉంటే అతడు త‌ప్ప‌నిస‌రిగా క్షమాపణ కోరాలి`` అన్నారు. బిష్ణోయ్ కమ్యూనిటీకి సంబంధించిన ఏదైనా ఆలయాన్ని సందర్శించి.. తన గత తప్పులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అతడు ఖాన్‌ను కోరారు. అలా చేస్తే సల్మాన్‌కి, సమాజానికి అది గౌర‌వం అని అభిప్రాయపడ్డారు. దీనిని బ‌ట్టి బిష్ణోయ్ స‌మాజం త‌గ్గేదే లే! అని అర్థం అవుతోంది.

రైతు నాయ‌కుడు ఇంకా స‌ల్మాన్ ని చాలా విధాలుగా హెచ్చ‌రించాడు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ``అతడు (లారెన్స్ బిష్ణోయ్) ఒక చెడ్డవాడు.. అతడు ఎప్పుడు ఎలాంటి హాని చేస్తాడో మీకు తెలియదు. క్షమాపణ కోరడం ద్వారా రక్షించుకోండి`` అని స‌ల్మాన్ కి సూచించాడు. సామాజిక సామరస్యాన్ని కాపాడుకోవడానికి ఒకరి తప్పులను గుర్తించడం చాలా కీలకమని ఆయన ఉద్ఘాటించారు.

సల్మాన్ ఖాన్ - లారెన్స్ బిష్ణోయ్ మధ్య వివాదం తీవ్ర‌త‌ర‌మైంది. ఇటీవల ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీ హత్యకు కారణమైంది. దీనికి బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ సంఘటన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ భద్రత గురించిన ఆందోళ‌న‌లను రేకెత్తించింది. ప్ర‌స్తుతం ఖాన్ చుట్టూ 100 మంది సెక్యూరిటీ మోహరించారు.