ముగ్గురు ఖాన్లు కలిసినా రానంత కిక్కు!
అయితే దేశంలో భాషా భేధం లేకుండా టోటల్ పాన్ ఇండియాని కొల్లగొట్టాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్నకు సమాధానం లభించింది.
By: Tupaki Desk | 6 Dec 2024 1:30 AM GMTఇటీవల పాన్ ఇండియన్ బాక్సాఫీస్ చుట్టూనే ఫిలింమేకర్స్ దృష్టి సారిస్తున్నారు. వివిధ రకాల భాషల్లోని ప్రతిభావంతులైన స్టార్లను కలుపుతూ భారీ మల్టీస్టారర్లు తెరకెక్కించడం ద్వారా పాన్ ఇండియా వసూళ్లను కొల్లగొట్టాలని పకడ్భందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే దేశంలో భాషా భేధం లేకుండా టోటల్ పాన్ ఇండియాని కొల్లగొట్టాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్నకు సమాధానం లభించింది.
నిజానికి ఓ ముగ్గురు స్టార్ల కలయికతో ఇది సాధ్యమేనని విశ్లేషిస్తున్నారు. ఆ ముగ్గురు ఎవరు? అంటే.. కింగ్ ఖాన్ షారూఖ్- రెబల్ స్టార్ ప్రభాస్- రాకింగ్ స్టార్ యష్ .. ఈ ముగ్గురూ కలిస్తే పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో లెవల్ లో సంచలన వసూళ్లు సాధ్యమవుతాయని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ముగ్గురూ కలిస్తే అది ముగ్గురు ఖాన్ ల కలయికను మించిన కిక్కిస్తుందని, బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదవ్వడం ఖాయమని భావిస్తున్నారు.
అయితే షారూఖ్- యష్ కాంబినేషన్ సినిమా గురించి చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్- కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్న `టాక్సిక్`లో పొడిగించిన అతిథి పాత్రలో షారూఖ్ నటిస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. అలాగే కేజీఎఫ్ 3లోను షారూఖ్ విలన్ గా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద అన్ని సమీకరణాలను మార్చగలదని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఖాన్ తో కలయిక వల్ల దక్షిణాది స్టార్ యష్ కి హిందీ బెల్ట్ లో బాక్సాఫీస్ వద్ద మరింత మైలేజ్ పెరుగుతుంది. అలాగే షారూఖ్ ఖాన్ పఠాన్ 2లో యష్ కూడా అదే తీరుగా పొడిగించిన అతిథి పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తోంది. KGF స్టార్ యష్ ఇటీవల షారుఖ్ ఖాన్‌ను మన్నత్ వద్ద సందర్శించడంతో ఇలాంటి ప్లానింగ్ ఏదో నడుస్తోందని అంతా ఊహిస్తున్నారు.
షారూఖ్ 2024లో చిరస్మరణీయమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. పఠాన్- జవాన్- డంకీ చిత్రాలు అతడికి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చాయి. అదే సమయంలో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రాలలో నటించిన యష్ తో షారూఖ్ కలయిక గొప్ప సహకారాన్ని సూచిస్తుందని అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది. అయితే షారూఖ్- యష్ కలయికతో రాజుకునే ఫీవర్ కి ప్రభాస్ యాడైతే పుట్టుకొచ్చే ఫీవర్ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. భారతదేశంలోని మూడు విభిన్న భాషల నుంచి బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి పని చేస్తే బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులు బ్రేకవ్వడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి కళారూపం దేశంలోని ఉత్తమ స్టార్లను కలిపేందుకు ఆస్కారం కల్పిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి ట్రెండ్ లో ఇది ఆహ్వానించదగిన పరిణామం.