సుకుమార్.. ఆ ఇద్దరి సరసన చేరుతాడా?
రాజమౌళి, వంగాల సరసన సుకుమార్ జాయిన్ అవుతాడా లేదా? అనేది వేచి చూడాలి.
By: Tupaki Desk | 30 Nov 2024 2:45 AM GMTదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పి దర్శక ధీరుడు అనిపించుకున్నారు. తన సినిమాలతో భాషా ప్రాంతీయత అడ్డంకులు చెరిపేసి, పాన్ ఇండియా మార్కెట్ కి కొత్త బాటలు వేశారు. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా పాన్ ఇండియా అంటున్నారంటే.. అందరికీ ఆ ధైర్యం ఇచ్చింది మాత్రం రాజమౌళినే అని చెప్పాలి. అయితే మన దర్శకుల్లో చాలా మంది బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు కానీ, జక్కన్న మాదిరిగా నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకోలేకపోతున్నారు.
'బాహుబలి 1', 'బాహుబలి 2', 'ఆర్.ఆర్.ఆర్' వంటి సినిమాలతో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసారు రాజమౌళి. జాతీయ స్థాయిలో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసారు. ఆ సినిమాల్లో నటించిన హీరోలకు ఎంత గుర్తింపు అయితే వచ్చిందో, దర్శకుడిగా అంతకంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. జక్కన్న పేరు మీదుగానే సినిమాలను మార్కెటింగ్ చేసుకుంటున్నారంటే, ఆయన క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 'రాజమౌళి' అంటే పేరు కాదు.. ఒక 'బ్రాండ్' అనే విధంగా మారిపోయింది. కానీ ఈ విషయంలో మిగతా టాలీవుడ్ దర్శకులు వెనకబడిపోయారు.
ఇటీవల కాలంలో తెలుగు నుంచి పలువురు దర్శకులు పాన్ ఇండియాకి వెళ్లారు. తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించారు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఊహించని విధంగా వసూళ్లు అందుకున్నారు. కాకపోతే ఎవరూ రాజమౌళి మాదిరిగా హిందీలో తమకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోలేకపోయారు. హిందీలో హిట్లు కొడుతున్నా, ఆ సినిమాల డైరెక్టర్ పేర్లు కూడా ఉత్తరాది ప్రేక్షకులు గుర్తించని పరిస్థితి ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగా మాత్రం మిగతా తెలుగు డైరెక్టర్స్ కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నారని అనుకోవాలి.
'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ గా 'కబీర్ సింగ్' చిత్రాన్ని తెరకెక్కించిన సందీప్ వంగ.. ఒక్క సినిమాతోనే హిందీ చిత్ర పరిశ్రమలో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోతో 'యానిమల్' మూవీ తీసి మరో బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్ లో వేసుకున్నారు. అందుకే ఇప్పుడు మోస్ట్ డిమాండబుల్ డైరెక్టర్ గా పిలవబడుతున్నారు. అదే సమయంలో 'కల్కి 2898 ఏడీ' సినిమా రూపొందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆ విధంగా క్రేజ్ ఏర్పరచుకోలేకపోయారు. మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరినా సరే, నాగి పేరు హిందీ ఆడియెన్స్ కి పెద్దగా రీచ్ అవ్వలేదు.
'కార్తికేయ 2' సినిమా తీసిన డైరెక్టర్ చందూ మొండేటి. 'హనుమాన్' మూవీ తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ.. ఇద్దరూ హిందీ సర్క్యూట్స్ లో మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ నార్త్ ఆడియన్స్ లోకి వెళ్లలేకపోయారు. 'దేవర 1' సినిమా హిందీలో మంచి వసూళ్లు సాధించినా, డైరెక్టర్ కొరటాల శివ పేరు అక్కడి జనాలకు తెలియలేదు. ఇప్పుడు ''పుష్ప 2'' సినిమాతో సుకుమార్ వంతు వచ్చింది. పార్ట్-1 తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కానీ, డైరెక్టర్ గురించి అక్కడ పెద్దగా డిస్కషన్స్ జరగలేదు. సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత, పుష్ప రాజ్ క్యారెక్టర్ ను క్రియేట్ చేసిన డైరెక్టర్ ఎవరనేది తెలుసుకోడానికి హిందీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారేమో చూడాలి.
నిజానికి రాజమౌళి ఎంతకష్టపడి సినిమా తీస్తారో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కూడా అంతే కష్టపడతారు. ఒక్కసారి రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాత, పక్కా ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేస్తారు. హీరోలతో కలిసి దేశమంతా తిరుగుతూ, అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ప్రెస్ మీట్లు పెట్టి, మీడియాలో సోషల్ మీడియాలో అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేస్తారు. ఇది సినిమాతో పాటుగా పరోక్షంగా రాజమౌళికి కూడా కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది. సందీప్ రెడ్డి వంగా కూడా ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. ఆయన తన సినిమాలతో పాటు రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయ్యారు. అతని ఇంటర్వ్యూల కోసం వేచి చూసే నార్త్ ఆడియన్స్ కూడా ఉన్నారు.
రాజమౌళి, సందీప్ వంగాల మాదిరిగా మిగతా తెలుగు డైరెక్టర్లు హిందీ జనాలను ఆకర్షించలేదనే చెప్పాలి. సినిమాలు హిట్టయినా, నార్త్ లో పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో అక్కడి వారికి తెలియలేదు. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాని అల్లు అర్జున్, రష్మిక మందన్న దూకుడుగా ప్రమోట్ చేస్తున్నారు కానీ.. ఇంతవరకూ దర్శకుడు సుకుమార్ మాత్రం బయటకు రాలేదు. అదే వీలైనంత త్వరగా సినిమాని కంప్లీట్ చేసి, ప్రచార కార్యక్రమాలకి తగినంత సమయం కేటాయిస్తే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సుక్కూ గురించి కూడా అందరూ మాట్లాడుకునేవాళ్ళు. మరి మూవీ రిలీజైన తర్వాత అయినా దర్శకుడి పేరు మార్మోగిపోతుందా?.. రాజమౌళి, వంగాల సరసన సుకుమార్ జాయిన్ అవుతాడా లేదా? అనేది వేచి చూడాలి.